APPSC Group 1 Mains 2025: రేపట్నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. ట్యాబ్‌లతోనే క్వశ్చన్ పేపర్లు జారీ!
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రేపట్నుంచి (మే 3) నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 4 జిల్లాల్లో 13 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది..

అమరావతి, మే 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి 2023 నోటిఫికేషన్ జారీ అవగా.. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు పూర్తైనాయి. ఇక మెయిన్స్ పరీక్షలు రేపట్నుంచి (మే 3) నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో దాదాపు 4,496 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు పేర్కొంది. విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించింది. ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు మే 1న ప్రకటన విడుదల చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరుగుతాయి. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు ఉంటాయి. పరీక్ష నిర్వహణ సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు పంపించం. నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ పరీక్షలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల్లోగా తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని పేర్కొంది. అంటే అరగంట ముందుగానే అభ్యర్ధులను లోనికి అనుమతిస్తారు. ఆలస్యమైతే సహేతుక కారణాలు చూపితే 9.45 గంటల వరకూ అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్ధలు హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఇక గత గ్రూప్ 1 మాదిరి ఈ సారి కూడా ట్యాబ్‌ల ద్వారా గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నపత్రాలు అందజేయనున్నారు. ఇన్విజిలేటర్లు అందజేసిన బుక్‌లెట్‌లలోనే అభ్యర్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. బుక్‌లెట్లపై ఆన్సర్లు రాసేందుకు బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే వాడాలని, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని కమిషన్ పేర్కొంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




