AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ కాలేజీ విద్యార్థులకు సర్కార్ తీపికబురు.. ఎట్టకేలకు అకౌంట్లో డబ్బులు జమ!

రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామండలిపై విమర్శలు తలెత్తాయి. ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు..

Andhra Pradesh: ఏపీ కాలేజీ విద్యార్థులకు సర్కార్ తీపికబురు.. ఎట్టకేలకు అకౌంట్లో డబ్బులు జమ!
AP-college Fee-Reimbursement-funds
Srilakshmi C
|

Updated on: Mar 13, 2026 | 11:15 AM

Share

అమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామండలిపై విమర్శలు తలెత్తాయి. ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దీంతో తాజాగా కాలేజీ విద్యార్ధులకు ఎలాంటి కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.1200 కోట్ల విడుదలకు బీఆర్‌వో విడుదల చేశారు. వెంటనే ఈ ఫీజులు తమ బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. అయితే ఉన్నత విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల జమలో ట్విస్ట్ ఇచ్చారు.

ప్రభుత్వం వద్ద నిధులు లేకపోయినా రుణాలు తీసుకొచ్చిమరీ బకాయిలు విడుదల చేస్తున్నందున.. కాలేజీ యాజమాన్యాలు ఆ రుణంపై 7.5 శాతం వడ్డీని కాలేజీలు చెల్లించాలని ప్రతిపాదించారు. అయితే కాలేజీల యాజమాన్యాలు ఈ అంశంపై అధికారుతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నట్లుగా అగ్రిమెంట్‌ రాయాలని ప్రతిపాదనలు కూడా చేశారు. కానీ కాలేజీల యాజమాన్యాలు ఇందుకు ససేమిరా అన్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు తీసుకోవడానికి.. రుణం తీసుకున్నట్లు చూపడం ఏంటని? ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం ఒకవేళ కాలేజీలు రుణం తీసుకున్నట్లు చూపినా ఏడాదిలోగా సాంఘిక సంక్షేమశాఖ ఆ రుణాన్ని చెల్లిస్తుందని.. ఆ భారం కాలేజీలపై పడదని యాజమాన్యాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కాలేజీ యాజమన్యాలు వెనక్కితగ్గలేదు.

మరోవైపు వడ్డీ కూడా భరించాలని సర్కార్‌ చెప్పడంతో కాలేజీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అలా చేస్తే 1200 కోట్లకు ఏకంగా రూ.90 కోట్లు వడ్డీ కింద కాలేజీలు కోల్పోవల్సి ఉంటుంది. దీంతో ఈ వ్యవహారంపై కాలేజీల యాజమాన్యాలు దాదాపు 250 మెయిల్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశాయి. కాలేజీలకు రావాల్సిన బకాయిలను తీసుకోవాలంటే వడ్డీ కట్టమని అంటున్నారని, ఇదేం న్యాయమని సీఎం చంద్రబాబుకు చెప్పి తమ గోడును వెల్లడించారు. వెంటనే స్పందించిన సీఎం వడ్డీ ప్రతిపాదన విషయంలో అధికారుల తీరును తుప్పుబట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఫీజుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ.300 కోట్ల ఫీజులు విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లు ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో త్వరలోనే తాజాగా విడుదలైన ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము కాలేజీల యాజమాన్యాల అకౌంట్‌లలో జమ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us