AP Edcet 2025 Notification: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎడ్ సెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో ఈ రోజు నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ 2025 నోటిఫికేషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్ గంగాధర్ ఏప్రిల్ 7 (సోమవారం)న విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఆచార్య ఏవీవీ స్వామి సూచించారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్ధులు తమ నచ్చిన కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీసీఏ లేదా బీకాం లేదా బీబీఎమ్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో అభ్యర్ధులు తప్పనిసరిగా 50 శాతం మార్కులు తెచ్చుకుని ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన వారు 40 శాతం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే జులై 1, 2025వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు తప్పని సరిగా 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 8 (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీలకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని వివరించారు.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. 2 గంటల వ్యవధిలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలకు 15 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు, మెథడాలజీ (సంబంధిత సబ్జె్క్టు నుంచి) 100 ప్రశ్నలకు 100 మార్కుల చొప్పున కేటాయిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మే 14, 2025.
- రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: మే 15 నుంచి మే 19 వరకు
- రూ.2వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: మే 20 నుంచి మే 23 వరకు
- రూ.4వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: మే 24వ తేదీ నుంచి 26 వరకు
- రూ.10వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: మే 27 నుంచి జూన్ 3 వరకు
- దరఖాస్తుల సవరణ తేదీలు: మే 24 నుంచి 28 వరకు
- హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ తేదీ: మే 30 నుంచి అవకాశం
- ఏపీ ఎడ్‌సెట్ 2025 రాత పరీ తేదీ: జూన్ 5, 2025 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఫలితాల విడుదల తేదీ: జూన్ 21, 2025.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.