AP DSC 2026 Notification: వచ్చే నెలలోనే మరో DSC నోటిఫికేషన్..? మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసా..
తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ పోస్టులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొందాలంటే డీఎస్సీ ఒక్కటే మార్గం. దీంతో ఏళ్లుగా నిరుద్యోగులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు తీసుకోవడం, లేదంటే సొంతంగా ప్రిపరేషన్ సాగించడం వంటివి చేస్తుంటారు. అయితే..

అమరావతి, జనవరి 7: రాష్ట్రంలో ఇటీవల 16 వేలకుపైగా టీచర్ కొలువులకు మెగా డీఎస్సీ నియామకాలు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్ని పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి. ఈ పోస్టులకు 2026లో మరో కొత్త నోటిఫికేషన్ ఇస్తామని గతేడాది కూటమి సర్కార్ ప్రకటించింది కూడా. ఈ మేరకు తాజాగా మరోమారు టెట్ పరీక్షలు నిర్వహించింది. ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీలను విడుదల చేసిన విద్యాశాఖ త్వరలోనే తుది కీలతోపాటు టెట్ ఫలితాలను కూడా వెల్లడించనుంది.
ఈ క్రమంలో అందరి దృష్టి త్వరలోనే విడుదలకానున్న డీఎస్సీ నోటిఫికేషన్‌పై పడింది. మరో DSC నోటిఫికేషన్ నిజంగా వస్తుందా? ఒక వేళ వస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందంటూ నిరుద్యోగులు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9వేల మందికిపైగా టీచర్లు రిటైర్ కానున్నారు. అలాగే 9,200 ప్రైమరీ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా మార్చిన తర్వాత అదనంగా ఉపాధ్యాయులు అవసరమని అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీంతో ఈ పోస్టుతోపాటు పాటు గత డీఎస్సీలో మిగిలిపోయిన అన్ని పోస్టులు కలిపి సుమారు 10 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. అయితే ఈ మొత్తం వెయ్యి పోస్టులకు కలిపి నోటిఫికేషన్ ఇస్తారా? లేదంటే అరకొర ఉద్యోగాలతోనే సరిపెడతారా అనేది నోటిఫికేషన్ ప్రకటన వెలువడేంత వరకు ఎదురు చూడాల్సిందే. అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి నెల రెండో వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి DSCలో కొత్తగా ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు విద్యాశాఖ కూడా రాష్ట్రంలోని పలు స్థాయిల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో రానున్న కొత్త డీఎస్సీ పరీక్ష విధానంలోనూ కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




