AP DSC 2024 Notification: రేపే మెగా డీఎస్సీ విడుదల.. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షలకు సరికొత్త ప్లాన్‌తో వస్తున్న విద్యాశాఖ!

మెగా డీఎస్సీ వెలువడే ఘడియలు సమీపిస్తున్నాయి. మరోవైపు విద్యాశాఖ వ్యూహాత్మకంగా డీఎస్సీ పోస్టుల నియామకాలకు సరికొత్త ప్లాన్లు రచిస్తోంది. బుధవారం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అదే రోజు నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించనుంది..

AP DSC 2024 Notification: రేపే మెగా డీఎస్సీ విడుదల.. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షలకు సరికొత్త ప్లాన్‌తో వస్తున్న విద్యాశాఖ!
AP DSC 2024 Notification
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 1:56 PM

అమరావతి, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. టెట్ ఫలితాలను సోమవారం విడుదల చేసిన విద్యాశాఖ ఇక మెగా డీఎస్సీ ప్రకటనకు సన్నద్ధమవుతుంది. బుధవారం (నవంబర్‌ 6వ తేదీన) మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. మొత్తం నెల రోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

దాదాపు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం పోస్టుల్లో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 వరకు పోస్టులు ఉండనున్నాయి. రేపు వెలువడనున్న నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల సంఖ్య కూడా మారే ఛాన్స్ లేకపోలేదు. కర్నూలు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.

అయితే టెట్ పరీక్షల మాదిరిగానే డీఎస్సీ పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక విడతల్లో పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు పోటీ పడేవారు అధికంగా ఉండటంతో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్‌ చేసి విడుదల చేయాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని కోణంలో విద్యా శాఖ యోచిస్తోంది. ఇది ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికి విద్యాశాఖ డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సరికొత్త ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే..!

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.