AP Mega DSC 2024 Postponed: నిరుద్యోగులకు ఊహించని షాక్.. ఏపీ మెగా డీఎస్సీ వాయిదా! కారణం ఇదే..
కోటి ఆశలతో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఊహించని షాక్ ఎదురైంది. బుధవారం విడుదలకానున్న మెగా డీఎస్సీ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపై కూడా క్లారిటీ లేదు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోయే పరిస్థితి నెలకొంది..
అమరావతి, నవంబర్ 6: రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2024 ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బుధవాంర డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటనను అధికారులు వాయిదా వేశారు. సోమవారం టెట్ ఫలితాలను ప్రకటించిన అధికారులు.. మరో రెండ్రోజుల వ్యవధిలో 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. దీంతో వెంటనే మెగా డీఎస్సీని కూడా విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఊహించని రీతిలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడింది. దీంతో ఎప్పటికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. ప్రస్తుతానికి డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేశారు.
మరోవైపు మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే కారణమని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది. ఎస్సీ రిజర్వేషన్లతో ఎస్సీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు డీఎస్సీ ప్రకటన ఇవ్వడానికి వీలులేదని MRPS డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఆయన రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పలు అంశాలను సీఎంతో చర్చించారు. డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడం, దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.
కూటమి సర్కారు కొలువుతీరిన తొలిరోజునే 16,317 పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ఎక్కువ ఖాళీలు భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి.