GDP Rate Cut: భారత GDP వృద్ధి అంచనాను రెండోసారి తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ఎందుకంటే..
GDP Rate Cut: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) అంచనాను ప్రపంచ బ్యాంకు మంగళవారం తగ్గించింది. దీని వెనుక కారణాలను తన నివేదికలో వెల్లడించింది.
GDP Rate Cut: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) అంచనాను ప్రపంచ బ్యాంకు మంగళవారం 7.5 శాతానికి తగ్గించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఉద్రిక్తతలు దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను ప్రపంచ బ్యాంకు సవరించడం ఇది రెండోసారి. అంతకు ముందు ఏప్రిల్‌లో వృద్ధి రేటు అంచనాను 8.7 శాతానికి తగ్గించారు. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా ఉండటం గమనార్హం.
వృద్ధికి ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడులు తోడ్పడతాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సంస్కరణలను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక వృద్ధి రేటు తాజా అంచనా జనవరిలో అంచనా వేసిన దాని కంటే 1.2 శాతం తక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు మరింత మందగించి 7.1 శాతానికి చేరుకుంటుందని తెలుస్తోంది. ఇంధనం నుంచి కూరగాయలతో సహా దాదాపు అన్ని ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేర్చింది. అదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయి అయిన 7.79 శాతానికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం రేటు దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన పాలసీ రేటైన.. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచింది. ఈ రోజు జరిగే ద్రవ్య విధాన సమీక్షలో ఈ రేటును మరింత పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కొవిడ్ కారణంగా నెమ్మదిగా వృద్ధి:
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. భారత్ లో 2022 ప్రథమార్థంలో వృద్ధి రేటు మందగించడానికి కారణం కరోనా కేసులు పెరుగటమే. దీంతో అనేక చోట్ల లాక్ డౌన్ విధించి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. ఇది కాకుండా.. ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రభావం చూపింది. రికవరీ మార్గంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వృద్ధి రేటుకు ప్రధాన సవాలుగా నిలుస్తోంది. నిరుద్యోగిత రేటు మహమ్మారికి ముందు స్థాయికి తగ్గిందని పేర్కొంది. కానీ.. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఇప్పటికీ మహమ్మారికి ముందు స్థాయి కంటే తక్కువగా ఉంది. కూలీలు తక్కువ జీతానికి పనికి వెళ్తున్నారని తన నివేదికలో ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
మంచి విధానాలు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి:
నివేదిక ప్రకారం దేశంలో.. మౌలిక సదుపాయాలపై పెట్టుబడికి ప్రాధాన్యత ఉంది. కార్మిక నిబంధనలను సరళీకృతం చేస్తున్నారు. అదే సమయంలో.. పేలవమైన పనితీరు కనబరుస్తున్న ప్రభుత్వ ఆస్తులను కేంద్రం ప్రైవేటుపరం చేస్తోంది. లాజిస్టిక్స్ రంగాన్ని ఆధునీకరించి, ఏకీకృతం చేయాలని భావిస్తోందని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ నివేదికకు ముందుమాటలో రాశారు. అనేక సంక్షోభాల తర్వాత దీర్ఘకాలిక కోణంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధికి తిరిగి రావడం అనేది నియమాల ఆధారిత విధాన వాతావరణంపై ఆధారపడి ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది.