AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో షాపింగ్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!

క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు.. తమ కార్డును ఉపయోగించి ఒక పరిమిత వరకు క్యాష్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బును తీసుకున్నప్పుడు, మొదటి రోజు నుండి వడ్డీని వేస్తారు. దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు వడ్డీ లేకుండా కాల వ్యవధి లభించదు. ఈ వడ్డీ రేటు 2% నుంచి 3% వరకు ఉంటుంది. బ్యాంకులు ఈ సేవకు కొంత రుసుమును కూడా వసూలు చేస్తాయి.

Credit Card: మీరు క్రెడిట్‌ కార్డుతో  షాపింగ్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
Credit Card
Subhash Goud
|

Updated on: Feb 12, 2024 | 10:26 AM

Share

పండగలు, ఇతర సమయాల్లో చాలా మంది షాపింగ్స్‌ చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్‌ కూడా జోరందుకుంది. ఎందుకంటే ఈకామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌, ఇతర ఆన్‌లైన్‌ సైట్లు షాపింగ్‌లపై రకరకాల డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అనేక ఆఫర్లను తీసుకొస్తుంటాయి. వాస్తవానికి, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో కంపెనీలు ఇలాంటి అనేక ఆఫర్‌లను విడుదల చేశాయి. కొంతమంది వినియోగదారులు ఈ ఆఫర్లను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఆఫర్లను చూసి క్రెడిట్‌ కార్డులతో గుడ్డిగా షాపింగ్ చేసేస్తుంటారు. కానీ క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చిన తర్వాత చెల్లించేటప్పుడు ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మీరు ఈ బిల్లుపై సకాలంలో చెల్లింపు చేయకపోతే, మీరు అప్పుల ఊబిలో కూరుకుపోవచ్చు. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు తెలివిగా షాపింగ్ చేస్తే, మీ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను మీరు మరింత ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. మరి పండుగ సీజన్‌లో క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

బిల్లింగ్ సైకిల్‌ను అర్థం చేసుకోవడం

మీరు క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేసినప్పుడు 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని పొందుతారు. ఈ ఫీచర్ ప్రయోజనాన్ని పొందడానికి, మీరు బిల్లింగ్ సైకిల్ ను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్ నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుంది అనుకుందాం. మీరు నవంబర్ నెల మొత్తం షాపింగ్ చేస్తే, బిల్లు డిసెంబర్ 1న జనరేట్ అవుతుంది. అప్పుడు మీరు డిసెంబర్ 20వ తేదీలోపు బిల్లు చెల్లించవచ్చు. ఈ విధంగా మీరు నవంబర్ మొదటి వారంలో షాపింగ్ చేస్తే మీరు ఎక్కువ రోజులు వడ్డీ రహిత ప్రయోజనాన్ని పొందుతారు. మీరు నవంబర్ 30న షాపింగ్ చేస్తే, వడ్డీ రహిత బకాయి బిల్లును క్లియర్ చేయడానికి మీకు 20 రోజుల సమయం మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పరిమిత పరిధిలో ఉపయోగించండి

పండుగ సీజన్‌లో మీరు బంపర్ డిస్కౌంట్‌లు లేదా క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. ఈ ఆఫర్‌ల ప్రయోజనాలను చాలా తెలివిగా పొందాలి. మీరు మీ క్రెడిట్ కార్డ్ ను పరిమిత పరిధిలోనే ఉపయోగించుకోవాలని మర్చిపోకూడదు. మీ కార్డ్ క్రెడిట్ వినియోగ రేటు (CUR)పై ఓ లుక్కేసి ఉంచండి. సీయూఆర్‌ మీరు ఉపయోగించిన క్రెడిట్ పరిమితి శాతాన్ని చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 30% వరకు ఉన్న CURను అనువైనదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీ కార్డ్‌కు 1,00,000 రూపాయల పరిమితి ఉంటే, మీరు 30,000 రూపాయల వరకు ఖర్చు చేయాలి. దీని కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతినవచ్చు. మీ CUR 30% మించి ఉంటే మీరు మీ కార్డ్ పరిమితిని పెంచుకోవడం మంచిది.

క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్‌ల నుండి ప్రయోజనం పొందండి

పండగలు, ఇతర సమయాల్లో సందర్భాలలో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై భారీ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లను పొందడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగని ప్రతీ ప్రోడక్ట్ కూ ఇలాగే డిస్కౌంట్ ఉంటుందని అనుకోవద్దు. కొన్ని ప్రోడక్ట్‌లకు మాత్రమే ఆఫర్లు వర్తిస్తాయి. సాధారణంగా నిర్దిష్ట పరిమితికి మించి చేసే కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. చాలా సార్లు క్యాష్‌బ్యాక్‌లపై గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు ఒక కార్డ్ పై ఇ-కామర్స్ సైట్‌లో 10% క్యాష్‌బ్యాక్‌ను అందించవచ్చు, కానీ దాని గరిష్ట పరిమితి 500 రూపాయలు ఉండవచ్చు. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్‌ల నిబంధనలు, షరతులను స్పష్టంగా అర్థం చేసుకోండి. క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్‌ల ఆకర్షణతో నడిచే అనవసరమైన షాపింగ్‌ను చేయకపోవడమే బెటర్.

నో-కాస్ట్ EMIని అర్థం చేసుకోవడం

పండుగ సీజన్‌లో, ‘నో-కాస్ట్ EMI’ ఆఫర్ కస్టమర్‌లను ఎక్కువగా ఆకర్షిస్తుంది. కస్టమర్‌లు ఒక ప్రోడక్ట్‌ కోసం వాయిదాల పద్దతిలో చెల్లింపులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే.. నగదు రూపంలో చెల్లింపు చేసేటప్పుడు కంపెనీ వాళ్లు ఇచ్చే కొన్ని రకాల డిస్కౌంట్లను పొందలేకపోవచ్చు. అదనంగా ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించాల్సి రావచ్చు. అందువల్ల ‘నో-కాస్ట్ EMI’ సౌలభ్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని మర్చిపోవద్దు. అందుకే షాపింగ్ చేయడానికి ముందు ‘నో-కాస్ట్ EMI’ లాభాలు, నష్టాలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం.

క్రెడిట్ కార్డ్‌ నుంచి క్యాష్ విత్ డ్రా చేస్తున్నారా?

క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు.. తమ కార్డును ఉపయోగించి ఒక పరిమిత వరకు క్యాష్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఏటీఎం నుండి డబ్బును తీసుకున్నప్పుడు, మొదటి రోజు నుండి వడ్డీని వేస్తారు. దాన్ని తిరిగి చెల్లించడానికి మీకు వడ్డీ లేకుండా కాల వ్యవధి లభించదు. ఈ వడ్డీ రేటు 2% నుంచి 3% వరకు ఉంటుంది. బ్యాంకులు ఈ సేవకు కొంత రుసుమును కూడా వసూలు చేస్తాయి. ఇది కనీసం 250 రూపాయలు ఉంటుంది. అదనంగా మీరు ఈ రుసుముపై 18% జీఎస్టీ చెల్లించాలి. దీనివల్ల ఇలాంటి రుణాలు చాలా బరువనే చెప్పాలి. అందుకే క్రెడిట్ కార్డ్‌ల నుంచి నగదును తీసుకోకుండా ఉండడమే ఉత్తమం.

మొత్తం మీద క్రెడిట్ కార్డ్‌లు షాపింగ్, బిల్లు చెల్లింపులకు మంచి ఆప్షన్‌ అయినా, క్రమశిక్షణతో ఉపయోగించినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు పొందగలరు. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ప్రతి నెలా పూర్తి బిల్లు మొత్తాన్ని సకాలంలో చెల్లించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి