US Recession: ఆర్థిక మాంద్యం అంచున అమెరికా.. ఆందోళనకు గురి చేస్తున్న ఫెడ్ నిర్ణయాలు..
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలానే ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతే.. ఆర్థిక మాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు...
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇలానే ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతే.. ఆర్థిక మాంద్యం తప్పదని అంచనా వేస్తున్నారు. అయితే చాలా దేశాలు ఇన్‌ఫ్లేషన్ కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి కష్టమైనా మరిన్ని రేట్ల పెంపునకు వెళ్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్ జెరోమ్ పావెల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే వడ్డీరేట్లను అధికంగా పెంచడం వల్ల మాంద్యం తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వృద్ధి మందగించి, ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారకుండా ఫెడ్ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది మేలో అమెరికా ద్రవ్యోల్బణం 8.6 శాతానికి చేరింది. 1981 తర్వాత ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. దీంతో ఫెడ్ తాజా సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 1994 తర్వాత ఇంత భారీగా ఫెడ్ వడ్డీరేట్లు పెంచలేదు.
వడ్డీ రేట్లు పెరిగితే వినియోగదారుల రుణ వ్యయాలు పెరుగుతూ పోతాయి. వ్యాపారులకూ అధిక వడ్డీ భారం పడుతుంది. దీంతో తప్పనిసరి అవసరాలు మినహా, ఇతర వ్యయాలు చేయడానికి జంకుతారు. ఇవన్నీ ఉద్యోగ వృద్ధిపై.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాంద్యం ఏర్పడేందుకు 50-50 అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాన్ని తప్పించుకోవడం కష్టతరమేన‘ని ఆర్థికవేత్తలంటున్నారు. అధిక రేట్ల వల్ల కొంత నష్టం జరుగుతోందని స్వయానా ఫెడ్ అంటోంది. వృద్ధికి అవరోధంగా మారే రేట్ల పెంపు వల్ల మాంద్యం వస్తుందనే ఆర్థిక చరిత్ర చెబుతోంది. 1955 నుంచి ఇప్పటి దాకా ద్రవ్యోల్బణం 4% కంటే ఎక్కువకు వెళ్లినపుడు; నిరుద్యోగం 5% దిగువకు చేరినపుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండేళ్ల వ్యవధిలోనే మాంద్యంలోకి వెళ్లింది. ఇపుడేమో అమెరికా నిరుద్యోగ రేటు 3.6 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మార్చి నుంచీ 8% పైనే ఉంది.