Trademark Registration: ఐదేళ్లలో బాగా పెరిగిన ట్రేడ్‌మార్క్‌ల నమోదు.. ట్రేడ్‌మార్క్ అంటే ఏమిటి? నమోదు ఎలానో తెలుసా?
మనం షాపింగ్ చేసేటప్పుడు, చాలా బ్రాండ్‌లు వాటి పేరు మీద TM అని వ్రాసినట్లు మీరు గమనించి ఉండాలి. TM నిజానికి ట్రేడ్‌మార్క్ అనే పదానికి సంక్షిప్త రూపం.
Trademark Registration: మనం షాపింగ్ చేసేటప్పుడు, చాలా బ్రాండ్‌లు వాటి పేరు మీద TM అని వ్రాసినట్లు మీరు గమనించి ఉండాలి. TM నిజానికి ట్రేడ్‌మార్క్ అనే పదానికి సంక్షిప్త రూపం. TM మార్క్‌ను ఎవరు పడితే వారు ఉపయోగించలేరు. దీని కోసం, రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ. గత ఐదు సంవత్సరాలలో, 14.17 లక్షల కొత్త ట్రేడ్‌మార్క్‌లు నమోదు అయ్యాయి. నిజానికి ఇది 1940 – 2015 సంవత్సరాల మధ్య జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్‌ల సంఖ్య కంటే ఎక్కువ. ట్రేడ్‌మార్క్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ట్రేడ్‌మార్క్ నమోదు పెరగడానికి కారణం ఏమిటి? ట్రేడ్‌మార్క్ నమోదు ప్రక్రియ ఏమిటి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం.
ట్రేడ్‌మార్క్ అంటే ఏమిటి?
ఏదైనా ఉత్పత్తి ప్రత్యేక గుర్తింపును దాని ట్రేడ్‌మార్క్ అంటారు. ఇది ఉత్పత్తి పేరు, డిజైన్, రంగు, ప్యాకింగ్ కలయిక కావచ్చు. ట్రేడ్ మార్క్స్ చట్టం 1999 ప్రకారం, ట్రేడ్‌మార్క్ అంటే ఏదైనా వస్తువులు లేదా సేవలను ఇతరుల నుండి వేరు చేయగల గ్రాఫికల్ గుర్తింపు. ఇది వర్డ్ మార్క్, లోగో లేదా రెండింటి కలయిక కూడా కావచ్చు. ట్రేడ్‌మార్క్ కూడా మేధో సంపత్తి. మీరు ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసి ఉంటే, మీ అనుమతి లేకుండా ఎవరూ దాన్ని ఉపయోగించలేరు. ట్రేడ్‌మార్క్ బ్రాండ్‌కు విశ్వసనీయతను కూడా ఇస్తుంది. సాధారణంగా అన్ని వ్యాపారాలు, స్టార్టప్‌లు తమ ట్రేడ్‌మార్క్‌లను నమోదు చేస్తాయి. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పేరు ట్రేడ్‌మార్క్ చేశారు.
గత ఐదేళ్లలో ట్రేడ్‌మార్క్ పెరగడానికి కారణం ఏమిటి?
కొత్త ట్రేడ్‌మార్క్ దరఖాస్తు పరిశీలన సమయం 13 నెలల నుండి 1 నెలకి తగ్గించారు. ఇంతకు ముందు ట్రేడ్‌మార్క్ నమోదు ప్రక్రియ 3-5 సంవత్సరాలు పట్టేది. ఇది ఇప్పుడు దాదాపు 6 నెలల్లో జరుగుతుంది. ఇది కాకుండా, మొదటి దశలో కేవలం 7% దరఖాస్తులు మాత్రమే ఆమోదించారు. అది ఇప్పుడు 50% కి పెరిగింది.
గత ఐదేళ్లలో 14.2 లక్షల కొత్త ట్రేడ్‌మార్క్‌లు నమోదు చేయడం వెనుక 3 పెద్ద కారణాలు ఉన్నాయి …
1. డిజిటలైజేషన్: ప్రారంభ దశలో ఎక్కువ దరఖాస్తులను నమోదు చేయడానికి డిజిటైజేషన్ ప్రధాన కారణం. డేటాబేస్ సరిగ్గా ఉన్నప్పుడు ట్రేడ్‌మార్క్ శోధన సులభం అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ ఆన్‌లైన్‌లో ఉంది. కొన్ని క్లిక్‌లలో ఇలాంటి ట్రేడ్‌మార్క్‌లు అన్నీ కనిపిస్తాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల సంఖ్య కూడా పెరిగింది.
2. మానవశక్తి: ట్రేడ్‌మార్క్‌ల పరిశీలన కోసం గత నాలుగు సంవత్సరాలలో 300 మందికి పైగా నియామకం పొందారు. సహజంగానే, 10 మంది 10 పనులు చేస్తుంటే, 100 మంది వ్యక్తులు 100 పనులు పూర్తి చేయవచ్చు.
3. కొత్త నిబంధనలు: 2017 లో ట్రేడ్‌మార్క్ నమోదు ప్రక్రియలో అనేక మెరుగుదలలు జరిగాయి. ఉదాహరణకు, ఫారమ్‌ల సంఖ్య 74 నుండి 8 కి తగ్గించారు. స్టార్టప్‌లు, వ్యక్తులు, చిన్న వ్యాపారాల కోసం మినహాయింపు ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా విచారణకు అనుమతింస్తున్నారు.
ట్రేడ్‌మార్క్ నమోదు ప్రక్రియ ఏమిటి?
ట్రేడ్‌మార్క్ చట్టం 1999, ట్రేడ్‌మార్క్ నియమాలు 2017 ప్రకారం ట్రేడ్‌మార్క్‌లు నమోదు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ట్రేడ్‌మార్క్ నమోదు ప్రక్రియ క్రింది విధంగా ఉంది …
- ముందుగా ట్రేడ్‌మార్క్‌ను ఎంచుకోవాలి. ఈ ట్రేడ్‌మార్క్ ప్రత్యేకంగా ఉండాలి. ఇది ముందుగా ఏదైనా ట్రేడ్‌మార్క్‌తో సరిపోలితే మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంచుకున్న ట్రేడ్‌మార్క్ కొత్తగా ఉండాలి.
- ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ట్రేడ్‌మార్క్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ..Trademark Website ని సందర్శించాలి. ఆఫ్‌లైన్ ప్రక్రియ కోసం జిల్లా ట్రేడ్‌మార్క్ కార్యాలయాన్ని సందర్శించాలి. మీ గుర్తింపు, చిరునామా, లోగో లేదా డిజైన్ కాపీతో సహా అప్లికేషన్ కోసం మీరు అనేక రకాల డాక్యుమెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.
- ట్రేడ్‌మార్క్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత, దీనిని పరీక్షిస్తారు. ఈ పరీక్ష తర్వాత నివేదిక జారీ చేస్తారు. నివేదికలో అభ్యంతరాలు లేనట్లయితే, అప్లికేషన్ తదుపరి ప్రాసెసింగ్‌కు వెళుతుంది.
- తరువాత అప్లికేషన్ ట్రేడ్‌మార్క్ జర్నల్‌లో ప్రచురిస్తారు. 4 నెలల వరకు ఎవరైనా ఈ ట్రేడ్‌మార్క్‌కు వ్యతిరేకంగా అభ్యంతరాన్ని దాఖలు చేయవచ్చు. నాలుగు నెలల పాటు ఎలాంటి అభ్యంతరం రాకపోతే, ఆ తరువాత మూడు వారాల్లోపు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. అభ్యంతరం స్వీకరిస్తే, దరఖాస్తుదారు తన సమాధానాన్ని 1 నెలలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది.