Car tips: వేసవిలో కారు ఇంజిన్ వేడెక్కిపోతోందా..? ఈ చిట్కాలతో సమస్య ఫసక్..!
వేసవి కాలం కావడంతో ఎండలు విపరీతంగా పెరిగిపోాయాయి. దాదాపు ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండ, ఉక్కబోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఏసీలు, ఎయిర్ కూలర్లు వేసుకుని సేద తీరుతున్నారు. అయితే మనుషులతో పాటు వాహనాలపై కూడా ఎండ తీవ్ర ప్రభావం చూపుతుంది.

వివిధ పనులు, అవసరాల కోసం ఎండలోనే కార్లల్లో ప్రయాణిస్తాం. కాబట్టి వేసవి లో వాహనాల సంరక్షణకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కార్లకు వివిధ సమస్యలు ఏర్పడతాయి. వాటి వల్ల ప్రయాణ సమయంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ కింద తెలిసిన చిట్కాలు పాటిస్తే ఎండ కారణంగా కలిగే ఇబ్బందుల నుంచి కార్లను సంరక్షించుకోవచ్చు. వేసవి సమయంలో మన దేశంలో ఎండలు విపరీతంగా కాస్తాయి. కొన్నిచోట్ల సుమారు 50 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటాయి. ఎండ, వేడి గాలుల కారణంగా కార్లలోని ఇంజిన్లు తరచూ వేడెక్కిపోతుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని కార్లను సంరక్షించుకోవచ్చు.
పార్కింగ్
కార్లలో వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు అక్కడక్కడా ఆగి విశ్రాంతి తీసుకుంటాం. ఆ సమయంలో చల్లని నీడ కింద కారును పార్కింగ్ చేయాలి. దాని వల్ల అప్పటి వరకూ వేడి గాలులతో, రన్నింగ్ కారణంగా వేడెక్కిన ఇంజిన్ చల్లబడుతుంది. ప్రయాణంలో టిఫిన్, భోజనాల కోసం కారును ఆపినప్పుడు నీడ ఉన్న ప్రదేశంలో పార్కింగ్ చేసుకుంటే ఇంజిన్ సంబంధిత సమస్యలు రావు.
ఇంజిన్ కూలెంట్
ఇంజిన్ కూలెంట్ స్థాయి సక్రమంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది కారు కూలింగ్ సిస్టమ్ కు ఉపయోగపడే ఓ లిక్విడ్. కూలెంట్ స్థాయి సక్రమంగా ఉండే ఇంజిన్ వేడెక్కదు. తద్వారా కారు చక్కగా పరుగులు పెడుతుంది. ఒక వేళ కూలెంట్ స్థాయి తగ్గిపోతే ఇంజిన్ వేడెక్కి, దానిలోని కదిలే భాగాలు ఒకదానితో ఒకటి రాసుకుని వాటిలో అరుగుదల ఏర్పడుతుంది. దీంతో సమస్యలు ఏర్పడి, ఒక్కోసారి ఇంజిన్ ను మార్చాల్సిన అవసరం రావచ్చు.
డ్రైవింగ్
మీరు డ్రైవింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఇంజిన్ ను వేడెక్కకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు ఓవర్ లోడ్ చేయకండి. దాని వల్ల అదనపు బరువు ఏర్పడి, దాని ప్రభావం ఇంజిన్ మీద పడుతుంది. ముందు వెళుతున్న వాహనాలకు నిర్ణీత దూరంలో ఉండడం వల్ల తరచూ బ్రేకులు వేసే అవసరం ఉండదు. అలాగే ట్రాఫిక్ లో చిక్కుకున్నప్పుడు ఇంజిన్ ను ఆఫ్ చేయడం చాలా మంచిది. దీని వల్ల ఇంజిన్ కు విశ్రాంతి కలిగి చల్లబడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








