Gold investment: బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
భారతీయులకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గాలలో బంగారం ఒకటి. ఈ లోహం విలువ క్రమంగా పెరుగుతూ ఉండడమే దీనికి ప్రధానం కారణం. మన జీవితాలకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంది. అది లేకుండా ఏ శుభకార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. మహిళలతో పాటు పురుషులు బంగారు ఆభరణాలను ఎంతో ఇష్టంగా ధరిస్తారు. అలాగే అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు బంగారు ఆభరణాలను తాకట్టు పెడతారు. వీటికి త్వరగా రుణాలు మంజూరు కావడంతో పాటు వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.

ఇటీవల బంగారం రేటు కొంచెం తగ్గింది. సుమారు రూ.లక్ష దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలా, ఇంకా వేచి ఉంటే లాభమా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై మార్కెట్ నిపుణులు పలు అంశాలను వెల్లడించారు. బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇటీవలే రికార్డు స్థాయికి చేరుకుంది. అనంతరం ఇప్పుడు గణనీయంగా తగ్గింది. దీనికి ప్రధానం కారణం లాభాల స్వీకరణతో పాటు చైనా సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కొంచె ఊరట లభించింది. సోమవారానికి పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,530, అలాగే 22 క్యారెట్ల బంగారం రూ.89,400గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి పోర్టుపోలియోలను వైవిధ్యపర్చడానికి బంగారంలో పెట్టుబడి పెట్టాలని, దానికి ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.
పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్ లో సుమారు 10 నుంచి 15 శాతాన్ని బంగారంలో ఉంచడం మంచిది. దీనివల్ల పోర్టుఫోలియో ప్రమాదాన్ని తగ్గించడానికి, ద్రవ్యోల్బణం నుంచి రక్షించుకోవడానికి, ఆర్థిక అనిశ్చితుల నుంచి స్థిరత్వం పొందడం సాధ్యమవుతుంది. భవిష్యత్తు వినియోగం, బహుమతి ఇవ్వడం, సంపదను పోగుచేసుకోవడం తదితర లక్ష్యాలున్నవారు ఈ సమయంలోనే బంగారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే బంగారంలో ఏళ్లుగా పెట్టుబడి పెడుతున్నవారు తమ ఆస్తులను సమతుల్యం చేసుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి కూడా ఇదే సమయం. ఏది ఏమైనా బంగారం కొనడం, లేదా నిల్వ చేసుకోవడం అనేది ప్రజల వ్యక్తిగత అవసరాలు, వారి భవిష్యత్తు లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం బంగారం ధర తగ్గుముఖం పట్టినప్పటికీ అది తాత్కాలికమేని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజలకు మరింత బంగారం కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందన్నారు. మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంతో డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిలో పెట్టుబడికి ఎలాంటి సందేహాలు వద్దని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








