ULIP pension plans: ఆ స్కీమ్‌తో విశ్రాంత జీవితం ప్రశాంతం..యులిప్ పెన్షన్ ప్లాన్ చాలా బెస్ట్..!
జీవితం సుఖంగా, సంతోషంగా సాగిపోవడానికి ప్రతి ఒక్కరూ అనేక ప్రణాళికలు వేసుకుంటారు. వాటిని సక్రమంగా అమలు చేస్తూ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అలాంటి వాటిలో పదవి విరమణ ప్రణాళిక అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వస్తుంది. ఆ డబ్బుతో హాయిగా జీవితం గడిచిపోతుంది. కానీ ఉద్యోగ విరమణ తర్వాత జీతం రాదు. పైగా వయసు పైబడడంతో అనేక రోగాలు చుట్టుముడతాయి. ఈ సమయంలో ఉపయోగపడేలా పదవీ విరమణ ప్రణాళిక వేసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నప్పుడే వీటిలో ప్రతినెలా పెట్టుబడి పెట్టుకోవాలి. అలాంటి వాటిలో యులిప్ పెన్షన్ ప్లాన్లు ఒకటి. వాటి వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

యులిప్ పెన్షన్ ప్లాన్ లో జీవిత బీమా, పెట్టుబడి కలిసే ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి పొందే అవకాశం కలుగుతుంది. మీరు చెల్లించే డబ్బులో కొంత జీవిత బీమాకు, మరికొంత పెట్టుబడికి కేటాయిస్తారు. ఈక్విటీ, డెట్, బ్యాలెన్స్ డ్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. దీని వల్ల మీ పదవీ విరమణ అనంతరం క్రమబద్దంగా ఆదాయం పొందటానికి వీలు కలుగుతుంది. అనుకోకుండా పాలసీదారులు మరణిస్తే, వారి కుటుంబానికి బీమా కూడా అందజేస్తారు. స్థిర రాబడిని అందించే సంప్రదాయ పెన్షన్ ప్లాన్ల మాదిరిగా కాకుండా యులిప్ ప్లాన్లు ఆకర్షణీయమైన ఆదాయం అందజేస్తాయి. వీటిలో పాలసీదారులు తమ పెట్టుబడిని వంద శాతం ఈక్విటీకి కేటాయించవచ్చు. దీని వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంతో పాటు ఉద్యోగ విరమణ నాటికి పెద్ద మొత్తంలో రాబడిని పోగుచేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు.
యులిప్ పాలసీదారులకు తమ కార్పస్ లో 60 శాతం వరకూ పన్ను లేకుండా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మిగిలిన 40 శాతాన్ని ప్రతి నెలా ఆదాయం వచ్చేలా యాన్యుటీ ప్లాన్ లో పెట్టుబడి పెడతారు. యులిప్ పథకాల వల్ల కలిగే మరో ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ఉద్యోగం చేస్తున్న సమయంలో పెట్టుబడిని పెంచుకోవచ్చు. తద్వారా ఉద్యోగ విరమణ అనంతరం పెద్ద మొత్తంలో సంపద పోగవుతుంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి సంప్రదాయ పెన్షన్ పథకాలు సరిపోవు. వాటితో పోల్చితే యులిప్ పథకాలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పాలసీదారులు తమ సంపదను పొందటానికి 60 ఏళ్ల వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు. యులిప్ ప్లాన్ తీసుకున్న ఐదేళ్ల అనంతరం తీసుకోవచ్చు. ఆర్థికంగా స్థిరపడాలనుకునే వారికి, పదవీ విరమణ వయసు కంటే ముందుగానే వైదొలగాలనకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటాయి. అత్యవసర సమయాల్లో అంటే పిల్లల విద్య, వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం వంటి వాటి కోసం పాలసీ వ్యవధిలో కార్పస్ ను మూడుసార్లు 25 శాతం వరకూ ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








