Supreme Court: చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం దిశగా ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసిన సుప్రీంకోర్టు!
సాధారణంగా ఆర్ధిక లావాదేవీల్లో భాగంగా, సంస్థలు, వ్యక్తులు బ్యాంకు చెక్కులను ఇస్తుంటాయి. ఇటువంటి చెక్కులు ఒక్కోసారి తగినంత నగదు లేకపోవడంతో బౌన్స్ అవుతాయి.
Supreme Court: సాధారణంగా ఆర్ధిక లావాదేవీల్లో భాగంగా, సంస్థలు, వ్యక్తులు బ్యాంకు చెక్కులను ఇస్తుంటాయి. ఇటువంటి చెక్కులు ఒక్కోసారి తగినంత నగదు లేకపోవడంతో బౌన్స్ అవుతాయి. ఇలా బౌన్స్ అయిన చెక్కులను చట్టరీత్యా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం కోసం న్యాయస్థానాల్లో ఏళ్ళకి ఏళ్లు నలుగుతూ ఉంటాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఇలాంటి కేసులు దాదాపు 35 లక్షలకు పైగా ఉన్నట్టు అంచనా. అందుకే సుప్రీం కోర్టు ఈ కేసుల పరిష్కారం త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా చట్టాలు సవరించాలని కేంద్రాన్ని కోరుతోంది.
చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం తొందరగా పూర్తయ్యేలా చూడటానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకే వ్యక్తిపై ఒకే లావాదేవీకి సంబంధించి నమోదైన కేసుల్లో ట్రయల్స్ అన్నీ ఒక్కదగ్గరకు చేరేలా చట్టాన్ని చేయాలనీ కేంద్రాన్ని కోరింది. ఈ కేసులను వేగంగా పరిష్కరించడానికి ట్రయల్ కోర్టులకు మార్గాదర్శకత్వాలను జారీ చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. చెక్ బౌన్స్ కేసుల్లో సాక్షులను ప్రత్యక్షంగా భౌతికంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా అఫిడవిట్ల ద్వారా సాక్షాలను పరిగణించవచ్చని ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వెల్లడించింది. అదేవిధంగా ఒక వ్యక్తిపై 12 నెలల్లో నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో విచారణ జరిగేలా చూడడానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలో తగిన సవరణలు చేయాలని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవై, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. దాదాపు 35 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉండటాన్ని ఒక వింతగా పేర్కొన్న కోర్టు, దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలను పేర్కొంటూ మూడు నెలల్లో నివేదికను సమర్పించడానికి మార్చి 10 న ఉన్నత న్యాయస్థానం కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది వారాల తరువాత చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించాదాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విషయాన్ని తీసుకుంటుందని తెలిపింది. గత ఏడాది మార్చి 5 న, అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసును నమోదు చేసింది. అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి “సంఘటిత , “సమన్వయ” యంత్రాంగాన్ని రూపొందించాలని నిర్ణయించింది.