Semiconductors: వేధిస్తున్న సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా గ్రూప్ ప్రయత్నాలకు ఆటంకం..!

దేశంలో సెమీ కండక్టర్ల కొరత తీర్చేందుకు టాటా గ్రూప్ దాదాపు రూ.2,250 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్‌ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను యుద్ధ ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది...

Semiconductors: వేధిస్తున్న సిలికాన్ వేఫర్ల కొరత.. టాటా గ్రూప్ ప్రయత్నాలకు ఆటంకం..!
Semi Conductor
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 06, 2021 | 11:20 AM

దేశంలో సెమీ కండక్టర్ల కొరత తీర్చేందుకు టాటా గ్రూప్ దాదాపు రూ.2,250 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్‌ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను యుద్ధ ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది. ఆ దిశగా పనులు కూడా మొదలు పెట్టింది. కానీ వారి ప్రయత్నాలకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పాడుతున్నాయి. సిలికాన్‌ వేఫర్ల వంటి ముడి పదార్థాల కొరతతో ఆటంకాలు ఏర్పడేలా ఉన్నాయని ఫిచ్‌ రేటింగ్స్‌ అనుబంధ సంస్థ ఫిచ్‌ సొల్యూషన్స్‌ నివేదిక పేర్కొంది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా సిలికాన్‌ వేఫర్ల కొరత ఏర్పడిందని తెలిపింది.

కరోనా వల్ల లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోంతో డేటా, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరిగిందని, ఇందుకు తగ్గట్లు సెమీకండక్టర్ల తయారీదార్లు సరఫరా చేయలేకపోతున్నారని నివేదికలో వెల్లడించింది. సెమీకండక్టర్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్న తైవాన్‌, అమెరికా, జపాన్‌ వంటి దేశాల్లో వాతావారణం సహకరించకపోవడం వ్యవస్థపై ఒత్తిడి మరింత పెంచుతున్నాయని పేర్కొంది.

ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అనువైనవని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడ ఏర్పాటు చేయనుందో ఈ నెలాఖరులోపు వెల్లడించే అవకాశం ఉంది. 2022 చివరి కల్లా కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్లాంట్ నెలకొల్పనున్నారు. సెమీ కండక్టర్ల అసెంబ్లీ, టెస్టింగ్‌ కేంద్రాన్ని పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌) విధానంలో నిర్వహించాలని టాటా గ్రూప్‌ భావిస్తున్నట్లు సమాచారం.

అధునాతన సిలికాన్‌ వేఫర్లను తైవాన్‌ కేంద్రంగా పనిచేసే సెమీకండక్టర్‌ ఫౌండ్రీలైన టీఎస్‌ఎంసీ వంటి సంస్థల నుంచి సమీకరించి, వాటితో చిప్‌సెట్లు అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ను దేశీయంగా చేయడమే టాటా గ్రూప్‌ ప్రణాళికగా తెలుస్తోంది. ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లు వస్తుండటంతో 2022 మధ్య వరకు, లేదంటే 2023 వరకు సెమీకండక్టర్‌ వేఫర్ల లభ్యతకూ ఇక్కట్లు తప్పవని అంచనా వేస్తున్నారు.

Read Also…  Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తాజాగా దేశంలో పసిడి ధరలు ఇలా ఉన్నాయి..!