Digital Rupee: ఆర్థిక రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం.. త్వరలో డిజిటల్ రూపీ: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Digital Rupee: ఆర్థిక రంగంలో సరికొత్త మార్పులకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భారత దేశం సొంత డిజిటల్ కరెన్సీని త్వరలో..
Digital Rupee: ఆర్థిక రంగంలో సరికొత్త మార్పులకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భారత దేశం సొంత డిజిటల్ కరెన్సీని త్వరలో తీసుకురానుంది. ఈ విషయంపై భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో డిజిటల్ రూపీ ట్రయల్స్ ప్రారంభిస్తామని ప్రకటించారు. సెంట్రల్‌బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ ఆన్‌లైన్‌లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో చెలామణీల ఉన్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్‌లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ గవర్నర్ ఈ అంశపై మాట్లాడారు. డిజిటల్ కరెన్సీ అనేది మన దేశంలో పూర్తిగా కొత్త సాధనం. కాబట్టి రిజర్వ్‌బ్యాంక్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అనంతరం ఆయన వడ్డీ రేట్లపై కూడా పలు అంశాలు మాట్లాడారు.
వడ్డీ రేట్లపై..
దేశంలో నెలకొన్న పలు కారణాల వల్ల ద్రవ్యోల్బణం తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచబోమని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తున్నామని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వడ్డీ రేట్ల పెంపు అంశపై ఇంకా తగిన సమయం రాలేదని భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్న తర్వాతే వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నిజానికి ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం సరికాదన్నారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక స్థితి పూర్తిగా మారిందని అది త్వరలో సరిగా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో కొనసాగినప్పుడు పలు మార్పులకు సమయమని ఇప్పుడు కాదని తెలిపారు.
డిసెంబర్ వరకు డిజిటల్ కరెన్సీ ట్రయల్స్ ప్రారంభిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. డిజిటల్ కరెన్సీ సెక్యూరిటీ, ద్రవ్య విధానంపై దీని ప్రభావం, చెలామణీలో ఉన్న నగదుపై డిజిటల్ రూపీ ప్రభావం వంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ డిజిటల్ కరెన్సీలో కేంద్రీకృత లెడ్జర్ విధానాన్ని అనుసరించాలా లేక బహుళ భాగస్వాములను కలిగిన డిజిటల్ డేటాబేస్‌ను నిర్వహించాలా అనే అంశపై పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కేంద్రీకృత లెడ్జర్ అయితే పూర్తి నిర్వహణ ఆర్బీఐ చేస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లకు ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, నగదు ప్రత్యక్ష వినియోగం తగ్గడం కారణంగా యూకే, యూరప్, చైనాలు డిజిటల్ కరెన్సీలను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.