AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Gold Reserves: ప్రపంచానికి ‘బంగారు కొండ’ ఆ దేశం.. మనమేమి తక్కువ కాదండోయ్..!

పసిడి పరుగులు పెడుతోంది.. సామాన్యునికి అందని రీతిలో వాటి ధరలు ఆకాశదేశాన విహరిస్తున్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ద్రవ్యోల్బణ భయాలు, వాణిజ్య యుద్ధాల ఆందోళనలు, ఆర్థిక మాంద్యం ముప్పు వాంటి ప్రధాన కారణాలతో బంగారం ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోని అనేక కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై ఫోకస్ పెట్టాయి.

RBI Gold Reserves: ప్రపంచానికి ‘బంగారు కొండ’ ఆ దేశం.. మనమేమి తక్కువ కాదండోయ్..!
Gold
Nikhil
|

Updated on: Apr 29, 2025 | 3:30 PM

Share

ముఖ్యంగా అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు భారీగా బంగారం నిల్వలను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కూడా ఇదే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. వీలైనంత ఎక్కువ బంగారం కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో అసలు బంగారం నిల్వలు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంత బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటోంది? అందుకు గల ప్రధాన కారణాలు ఏమిటి? తెలుసుకుందాం రండి..

ఆర్బీఐ వద్ద బంగారం ఎంతంటే..?

ప్రపంచ దేశాలన్నీ వీలైనంత ఎక్కువ బంగారం నిల్వలు ఉండేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 879టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికా నంబర్ వన్ స్థానంలో ఉంది. దాని వద్ద 8,133.46 టన్నులు ఉంది. ఆ తర్వాత స్థానంలో జర్మనీ 3,351.53 టన్నులు, ఇటలీ వద్ద 2,452.84 టన్నులు, ఫ్రాన్స్ 2,436.94 టన్నులు, చైనా 2,264.32 టన్నులు, స్విట్జర్లాండ్ 1,039.94 టన్నులు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ స్థానం ఏడు కాగా.. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ 845.97 టన్నులతో ఎనిమిదో స్థానంలో ఉంది. మన ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం కిలోలలో చూస్తే 8,79,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ వేల కోట్ల డాలర్లు ఉంటుంది. మన కరెన్సీలో చూస్తే గ్రాముకు రూ. 10వేల చొప్పున లెక్కిస్తే సుమారు రూ. 8.79 లక్షల కోట్లు అవుతుంది. మన దేశ విదేశీ మారక నిల్వలో బంగారం వాటా 11.7శాతంగా ఉంది.

నిల్వలు ఎందుకు పెంచుకోవాలి..

ప్రపంచ మార్కెట్ పై ద్రవ్యోల్బణ భయాలు, వాణిజ్య యుద్ధాల ఆందోళనలు, ఆర్థిక మాంద్యం ముప్పు వంటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అంతేకాక అత్యంత విశ్వసనీయ రిజర్వ్ కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్ తన ప్రాధాన్యతను కోల్పోతోంది. ఈ క్రమంలో బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టబడి సాధనంగా పరిగణిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం సమయంలో ఇది విలువను కాపాడుతుంది. అందుకే అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఆర్బీఐ కూడా ఈ విషయంలో చురుకుగానే వ్యవహరిస్తోంది. 2024లో 72.6 టన్నులు, 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరో 2.8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..