RBI Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు రద్దు కానున్నాయా?
RBI Notes: 2016లో రూ.500, రూ.1,000 నోట్లను హఠాత్తుగా ఉపసంహరించుకున్న పెద్ద నోట్ల రద్దు తాలూకు జ్ఞాపకాలు ప్రజల మదిలో ఇంకా తాజాగా ఉండటమే ఈ వదంతి వేగంగా వ్యాపించడానికి ఒక కారణం. చిన్న విలువ గల నోట్లను నిలిపివేసే ప్రణాళికలు..

PIB Fact Check : 2005కు ముందు ముద్రించిన పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను జూలై 1వ తేదీ నుంచి రద్దు చేయనున్నట్లు ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. ఈ సందేశంపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక లోగో ఉంది. ఇది నిజమైన ప్రభుత్వ నోటీసులా కనిపిస్తోంది. ఈ వాదన నోట్ల రద్దుపై కొత్తగా భయాలను రేకెత్తించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిజంగా అలాంటి నిర్ణయం తీసుకుందా? లేక ఇది కేవలం పుకారా అని తెలుసుకునే పనిలో ఉన్నారు. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఇది ఫేక్ వార్త అంటూ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి తప్పుడు వార్తలను అస్సలు నమ్మవద్దని పేర్కొంది. తన పిఐబి ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వాదన నకిలీదని వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నోటీసుకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పిఐబి స్పష్టం చేసింది. ఈ చిన్న నోట్లను రద్దు చేయడానికి ప్రభుత్వం గానీ, రిజర్వ్ బ్యాంక్ గానీ అటువంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: Gas Cylinder: ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. చాలా మందికి తెలియని సీక్రెట్ ఇదే!
మహారాష్ట్ర బ్యాంక్ వివరణ
వైరల్ అవుతున్న సందేశం నకిలీదని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కొట్టివేసింది. తమ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం పూర్తిగా తప్పు, నిరాధారమైనదని ఒక వివరణలో బ్యాంక్ పేర్కొంది. అటువంటి వదంతులను నమ్మవద్దని లేదా వాటిని ఇతరులకు ఫార్వార్డ్ చేయవద్దని బ్యాంక్ తన కస్టమర్లకు, సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
పాత నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయి
ఈ నకిలీ సందేశానికి స్పందిస్తూ, 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పునరుద్ఘాటించింది. భద్రతా ఫీచర్లను మెరుగుపరచడానికి పాత మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను కొత్త వాటితో మార్చుకోవాలని తాము గతంలో ప్రజలను ప్రోత్సహించామని, అయితే ఈ నోట్లపై ఎటువంటి నిషేధం విధించలేదని కేంద్ర బ్యాంకు అంగీకరించింది. ఈ పాత నోట్లు నేటికీ లావాదేవీలకు పూర్తిగా చెల్లుబాటులో ఉన్నాయి. ఇలాంటి లేనిపోని వదంతులను నమ్మవద్దని తెలిపింది.
🚨Do not fall for fake news!
A notice allegedly issued by Bank of Maharashtra is being shared online, falsely stating that, as per RBI directives, ₹10, ₹20, ₹50, and ₹100 banknotes printed before 2005 will not be accepted from July 1, 2026#PIBFactCheck: ❌ This claim is… https://t.co/mF7fdyQWvm
— PIB India (@PIB_India) June 27, 2026
2016లో రూ.500, రూ.1,000 నోట్లను హఠాత్తుగా ఉపసంహరించుకున్న పెద్ద నోట్ల రద్దు తాలూకు జ్ఞాపకాలు ప్రజల మదిలో ఇంకా తాజాగా ఉండటమే ఈ వదంతి వేగంగా వ్యాపించడానికి ఒక కారణం. చిన్న విలువ గల నోట్లను నిలిపివేసే ప్రణాళికలు ఏవీ లేవని పీఐబీ, ఆర్‌బీఐ ఇప్పుడు స్పష్టం చేశాయి. బ్యాంకింగ్ లేదా కరెన్సీకి సంబంధించిన ఏ వార్తను గుడ్డిగా నమ్మవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. అటువంటి సమాచారాన్ని నిజమని అంగీకరించే ముందు దానిని అధికారిక ఆర్‌బీఐ వెబ్‌సైట్ లేదా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా ధృవీకరించుకోవాలి.
ఇది కూడా చదవండి: Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




