రేషన్ కార్డు పోయిందా..? నో టెన్షన్.. మొబైల్లోనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి..
వన్ నేషన్-వన్ రేషన్ కార్డులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ తీసుకొచ్చింది. అదే మేరా రేషన్ యాప్. ఈ యాప్ ద్వారా మీ రేషన్ కార్డుకు సంబంధించిన ప్రతీ సమాచారం పొందవచ్చు. రేషన్ కార్డును డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అంటే..

వన్ నేషన్-వన్ రేషన్ కార్డు అనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే రేషన్ కార్డు సేవలు పొందవచ్చు. సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి రేషన్ పొందవచ్చు. అలాగే దేశంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా రేషన్ సర్వీసులు పొందవచ్చు. మీరు ఎంత రేషన్ పొందారు..? రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకోవడం, కేవైసీ అప్డేట్ చేసుకోవడం, పేరు తొలగించడం, పేరు జోడించడం లాంటి పనులన్నీ యాప్ ద్వారానే చేసుకోవచ్చు. అలాగే రేషన్ కార్డును కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీ రేషన్ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా..?
-ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ను తెరిచి, “Mera Ration ” అని సెర్చ్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి
-యాప్‌ను తెరిచిన తర్వాత హోమ్‌పేజీలో “బెనిఫిషరీ యూజర్” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి
-మీకు కనిపించే స్క్రీన్‌పై మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి
-లాగిన్ విత్ ఓటీపీ బటన్‌పై క్లిక్ చేయండి
-మీ ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది
-ఆ ఓటీపీని ఎంటర్ చేసి “వెరిఫై” బటన్‌ను నొక్కండి
-విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత ఎంపిన్ (MPIN) సెట్ చేసుకోండి. తర్వాత నుంచి యాప్‌లోకి లాగిన్ అవ్వడానికి ఓటీపీ అవసరం లేకుండా నేరుగా ఎంపిన్‌తో లాగిన్ అవ్వవచ్చు
-లాగిన్ అయిన వెంటనే మేరా రేషన్ కార్డు యాప్ హోమ్‌పేజీలోకి వెళతారు
-స్క్రీన్ కుడి వైపున పైన ఉన్న “డౌన్లోడ్” బటన్‌పై క్లిక్ చేయండి
-మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి
మేరా రేషన్ 2.0 యాప్‌లో లభించే సేవలు
మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. కొత్త సభ్యులను చేర్చడం లేదా ఉన్నవారిని తొలగించడం వంటివి చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ రేషన్ కార్డు ఆప్షన్ ద్వారా మీరు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మీ రేషన్ కార్డును సులభంగా బదిలీ చేసుకోవచ్చు. మీరు రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే, “ట్రాక్ మై రేషన్” ఆప్షన్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. “రేషన్ ఎంటైటిల్మెంట్” విభాగంలో మీకు ఎంత రేషన్ వస్తుంది, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని కిలోలు అందుకున్నారు వంటి పూర్తి వివరాలను చూడవచ్చు.
