Aadhaar Card: ఆధార్ కార్డులో ఈ వివరాలు అప్డేట్ చేసుకోవడం ఫ్రీ.. డిసెంబర్ 31 వరకే లాస్ట్ ఛాన్స్.. త్వరపడండి..
ఆధార్ కార్డుదారులకు ఇది నిజంగా శుభవార్తే. మీ ఆధార్ ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం ఈ అవకాశం అందుబాటులో ఉంది. తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చు.

ఆధార్ కార్డుదారులకు తీపికబురు అందింది. యూఐడీఏఐ భారీ ఊరట కలిగించే వార్త తీసుకొచ్చింది. ఆధార్ కార్డు వివరాల్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అడ్రస్, మొబైల్ నెంబర్, పేరు, బయోమెట్రిక్స్ వంటివి అప్డేట్ చేసుకోవాలంటే నిర్ణీత రుసుంలు చెల్లించాలి. కానీ కొన్ని మాత్రం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందులో ఒకటి ఈమెయిల్. ఆధార్‌కు మీ ఈమెయిల్ లింక్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మొబైల్‌కు ఓటీపీలు అందవు. ఇలాంటి సమయంలో మెయిల్ ఐడీకి ఆధార్ నుంచి వచ్చే ఓటీపీలు పొందవచ్చు. దీని వల్ల ఆధార్ సర్వీసుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకోవాలంటే ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం మీ ఆధార్ కార్డుకు అనుసంధానించబడిన ఈమెయిల్ ఐడీని ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ కొత్త అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ అవకాశం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. దీంతో ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని యూఐడీఏఐ చెబుతోంది. ఈ తేదీ తర్వాత ఈ సేవకు ఛార్జీలు వర్తించవచ్చు.
మీరు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు పాత ఈమెయిల్ ఐడీని అందించి ఉంటారు. ఆ మెయిల్ ఐడీ కోల్పోవడం లేదా ప్రస్తుతం మరో మెయిల్ ఐడీ వాడటం లాంటివి చేస్తుండవచ్చు. దీంతో ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న యాక్టివ్‌గా ఉండే ఈమెయిల్ ఐడీ ఆధార్‌కు అప్డేట్ చేయడం చాలా అవసరం. ఆధార్ సంబంధిత నోటిఫికేషన్లు, OTPలు, ఇతర ముఖ్యమైన సమాచారం అంతా ఈమెయిల్ ద్వారానే పొందవచ్చు. దీని వల్ల మొబైల్ నెంబర్‌కు ఓటీపీలు అందుకోలేని పక్షంలో మెయిల్ ఐడీ ద్వారా వాటిని యాక్సెస్ చేయవచ్చు. అయితే కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే మెయిల్ ఐడీ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా అయితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచితంగా అప్డేట్ చేసుకోవడం ఎలా..?
-ఆధార్ యాప్‌ను ఇన్స్టాల్ చేయండి:*
-యాప్‌ను తెరిచి ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఉపయోగించి లాగిన్ అవ్వండి
-లాగిన్ అయిన తర్వాత యాప్‌లో సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
– సర్వీసెస్ విభాగంలో ఫ్రీ ఈమెయిల్ అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-మీకు గతంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడీ అక్కడ చూపిస్తుంది
-దాని కింద స్టెప్ బై స్టెప్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-అనంతరం కొత్తగా అప్డేట్ చేయాలనుకుంటున్న ఈమెయిల్ ఐడీని నమోదు చేయడానికి ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది
-అక్కడ మీ ప్రస్తుత ఈమెయిల్ ఐడీని టైప్ చేయండి
-అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది
-OTP ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ అభ్యర్థన విజయవంతంగా స్వీకరించబడుతుంది
-24 గంటలలోపు ఆధార్ డేటాబేస్‌లో మీ మెయిల్ ఐడీ అప్డేట్ అవుతుంది
