Hyderabad: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే వీకెండ్ ప్లాన్.. పక్షుల కిలకిలారావాల మధ్య సరికొత్త నేచర్ వాక్
వీకెండ్ వచ్చిందంటే మాల్స్, సినిమాలేనా..? కాస్త కొత్తగా ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిలారావాలు వింటూ ఉదయాన్ని ఆస్వాదించాలనుకునే హైదరాబాద్ వాసులకు తెలంగాణ టూరిజం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. నగరం నడిబొడ్డున అరుదైన పక్షులను దగ్గరగా చూసేలా వింగ్స్ అండ్ వైల్డర్నెస్ పేరుతో సరికొత్త నేచర్ వాక్కు శ్రీకారం చుట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిత్యం కాంక్రీట్ జంగిల్లో, ఉరుకులు పరుగుల జీవితంలో గడిపే నగర వాసులకు ప్రకృతి ఒడిలో సేదతీరే అద్భుత అవకాశాన్ని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కల్పించింది. ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో వింగ్స్ అండ్ వైల్డర్నెస్ నేచర్ వాక్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం హైదరాబాద్లోని నానక్రామ్గూడ, ఘర్-ఎ-ముబారక్ వద్ద ప్రారంభమైన ఈ తొలి నేచర్ వాక్కు పక్షి ప్రేమికులు, ప్రకృతి ఔత్సాహికుల నుండి విశేష స్పందన లభించింది. దాదాపు 30 మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. నగర వాసులను ప్రకృతికి మరింత చేరువ చేసేందుకు ఈ ప్రత్యేక నడకను ఇకపై ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ ప్రకటించింది.
అరుదైన పక్షి జాతుల వీక్షణ
నిపుణుల మార్గదర్శకత్వంలో సాగిన ఈ ప్రకృతి నడకలో పాల్గొన్నవారు ఎన్నో అరుదైన, అందమైన పక్షి జాతులను ప్రత్యక్షంగా వీక్షించి మురిసిపోయారు. వీటిలో ప్రధానంగా.. నెమలి, కింగ్ఫిషర్, గోల్డెన్ ఓరియోల్, గ్రీన్ బీ-ఈటర్, షిక్రా, బ్లాక్ డ్రోంగో, ఏషియన్ కోయల్, రెడ్-వెంటెడ్ బుల్బుల్, ఇండియన్ సిల్వర్బిల్ తదితర పక్షులను సందర్శకులు కెమెరాల్లో బంధించారు. పాకెట్ ఫీల్డ్ గైడ్స్ సహాయంతో పక్షుల శారీరక లక్షణాలు, రంగులు, వాటి కిలకిలారావాల ఆధారంగా ఆయా జాతులను ఎలా గుర్తించాలో నిపుణులు సులభంగా వివరించారు. అలాగే స్థానిక, స్థానికేతర వృక్ష జాతులు పక్షులకు ఏ విధంగా ఆవాసాలుగా మారుతున్నాయి.. తద్వారా పర్యావరణ సమతుల్యత ఎలా సాధ్యమవుతుందో అవగాహన కల్పించారు.
యువతలో ప్రకృతి పట్ల బాధ్యత పెరగాలి: TGTDC ఎండీ
ఈ సందర్భంగా TGTDC మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. జీవవైవిధ్య పరిరక్షణలో, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పక్షులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇలాంటి నేచర్ వాక్ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా యువత, నగర ప్రజల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
