Rakesh Jhunjhunwala: మూడు నెలల్లో వేల కోట్లు కోల్పోయిన రాకేష్ జున్‌జున్‌వాలా.. ఆ స్టాక్ ఏ కారణం..
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మార్కెట్ల పతనం తీవ్రంగా నష్టాన్ని కలిగించింది. స్టాక్ మార్కెట్‌లో లక్షలాది మంది ఆయనను అనుసరిస్తుంటారు.
Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మార్కెట్ల పతనం తీవ్రంగా నష్టాన్ని కలిగించింది. స్టాక్ మార్కెట్‌లో లక్షలాది మంది ఆయనను అనుసరిస్తుంటారు. ఆయన పట్టిన ప్రతి స్టాక్ మంచి లాభాలను అందిస్తుందని చాలా మంది నమ్మకం. అయితే టాటా గ్రూప్ షేర్ ఆయనకు పెద్ద ఎదురుదెబ్బను ఇచ్చింది. టైటాన్ స్టాక్ లో గత మూడు నెలల్లో జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా దాదాపు రూ. 3,500 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఈ సమయంలో.. కంపెనీ షేర్లు దాదాపు 29 శాతం పతనమయ్యాయి.
మార్చి 17, 2022 నుంచి టైటాన్‌లో జున్‌జున్‌వాలా దంపతుల వాటాలు రూ.3,489 కోట్లు తగ్గాయి. శుక్రవారం బిఎస్‌ఈలో కంపెనీ షేరు క్షీణత కారణంగా రూ.1,925కు దిగజారింది. ఇది తొమ్మిది నెలల కనిష్ఠ స్థాయి. ఇది గతంలో రూ. 2,767.55 వద్ద ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. మార్చి 2022 నాటికి, జున్‌జున్‌వాలా దంపతులు కంపెనీలో 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇందులో రాకేష్ జున్‌జున్‌వాలా వాటా 3.98 శాతం కాగా, రేఖా జున్‌జున్‌వాలా వాటా 1.07 శాతంగా ఉంది.
గత మూడు నెలల్లో మార్కెట్ క్యాప్ భారీ పతనం కావటంతో.. టైటాన్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.69,092 కోట్లు క్షీణించింది. శుక్రవారం నాటి వ్యాపారంలో రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. దేశంలోని బ్రాండెడ్ ఆభరణాలు, చేతి గడియారాల మార్కెట్‌లో టైటాన్ అగ్రగామిగా ఉంది. ఆభరణాల్లో కంపెనీకి తనిష్క్, కారట్‌లేన్, జోయా అండ్ మియా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. చేతి గడియారాల్లో కంపెనీకి టైటాన్, సొనాటా, ఫాస్ట్రాక్, జిలిస్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లను కలిగి ఉంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 7.21 శాతం క్షీణించింది.