Lic policies: అమ్మో.. 880 కోట్ల రూపాయలను వదిలేసిన పాలసీదారులు.. అన్‌క్లెయిమ్‌డ్ పాలసీల వివరాలు ప్రకటించిన ఎల్ఐసీ
ప్రతి ఒక్కరూ డబ్బులను చాలా ప్రణాళికాబద్దంగా ఖర్చు చేస్తారు. తమకు వచ్చిన ఆదాయాన్ని బట్టి ఇంటి అవసరాలకు పోను మిగిలిన దాన్ని పొదుపు చేస్తారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఒక్క రూపాయి కూడా పోకుండా జాగ్రత్త పడతారు. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చెందిన పాలసీదారులు దాదాపు రూ.880 కోట్లను క్లెయిమ్ చేసుకోకుండా వదిలేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఇటీవల పార్లమెంటుకు తెలిపింది.
భవిష్యత్తుకు భరోసా కల్పించే వాటిలో జీవిత బీమా పాలసీలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తారు. మన దేశంలో ఎల్ ఐసీకి ఆదరణ ఎక్కువ. ఈ కంపెనీలో అనేక కోట్ల మంది పాలసీలు కడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,72,282 మంది ఎల్ ఐసీ పాలసీదారులు తమ మెచ్యూరిటీ ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోలేదు. వీటి విలువ దాదాపు 880 కోట్ల రూపాయలు కావడం విశేషం. పాలసీదారుడు మూడేళ్లు, అంతకంటే ఎక్కు సంవత్సరాలు బీమా సంస్థ నుంచి ప్రయోజనాలు పొందకపోతే అతడి పాలసీని అన్ క్లెయిమ్ గా పరిగణిస్తారు. కొందరు తమ పాలసీలు మెచ్యూర్ అయినా క్లెయిమ్ చేసుకోరు. మరికొందరు ప్రీమియాలను సగంలో మానేస్తారు. ఇంకొన్ని సందర్బాల్లో పాలసీదారుడు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు పాలసీని పట్టించుకోరు. ఇలాంటివన్నీ క్లెయిన్ చేసుకోని పాలసీ కిందకు వస్తాయి. ఒక పాలసీని పదేళ్లకు పైగా క్లెయిమ్ చేసుకోకపోతే దాని డబ్బులను ప్రభుత్వ సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధికి బదిలీ చేస్తారు.
పాలసీ చెకింగ్ ఇలా
- ఎల్ఐసీ ఇండియా.ఇన్/హోమ్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లండి.
- హెమ్ పేజీలో కస్టమర్ సర్వీస్ పై క్లిక్ చేయాలి.
- క్లెయిమ్ చేయని పాలసీదారులను ఎంపికను ఎంచుకోండి.
- మీ దగ్గర ఉన్న పాలసీ నంబర్, పేరు, ఇతర వివరాలను నమోదు చేయాలి.
- వెంటనే పాలసీ గురించి అన్ని వివరాలు తెలుస్తాయి.
క్లెయిమ్ చేసుకోవడం ఇలా
- సమీపంలోని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి క్లెయిమ్ ఫారం పొందండి. లేదా ఆ సంస్థ అధికార వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
- పాలసీ డాక్యుమెంట్, ప్రీమియం రశీదులు, అవసరమైతే పాలసీదారుడి డెత్ సర్టిఫికెట్ తదితర వాటిని సిద్దం చేసుకోండి.
- క్లెయిమ్ దరఖాస్తులో వివరాలను పూర్తిగా నింపి, దానికి పైన తెలిపిన పత్రాలను జతచేసి ఎల్ఐసీ కార్యాలయంలో అందజేయండి.
- నిబంధనల మేరకు మీకు పాలసీ ప్రయోజనాలు అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి