Patanjali: అదంతా తప్పుడు ప్రచారం.. నెయ్యి నాణ్యత వివాదంపై ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌కు పతంజలి
పతంజలి తమ ఆవు నెయ్యి నాణ్యతపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. NABL గుర్తింపు లేని ల్యాబ్‌లో పరీక్షలు జరిగాయని, గడువు ముగిసిన శాంపిల్‌పై కోర్టు ఉత్తర్వులు అన్యాయమని తెలిపింది. RM విలువ లోపాలు సహజమని, ఇది నాణ్యతను ప్రభావితం చేయదని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది.

యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థ తమ ఆవు నెయ్యి నాణ్యతపై ఇటీవల వచ్చిన వార్తలను ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని తీవ్రంగా ఖండించింది. నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడానికి కఠినమైన పరీక్షల తర్వాతే తమ ఆవు పాలు, నెయ్యిని విక్రయిస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.
ఆరోపణలు – వాదనలు
పిథోరగఢ్‌లోని ఆహార భద్రతా విభాగం 2020 అక్టోబర్ 20న దాఖలు చేసిన కేసును ఉటంకిస్తూ పతంజలి తన ప్రకటనలో ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తింది:
NABL-గుర్తింపు లేని లాబొరేటరీ
నెయ్యిని పరీక్షించడానికి ఉపయోగించిన రిఫెరల్ లాబొరేటరీకి NABL (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు లేదని పతంజలి తెలిపింది. అందువల్ల అక్కడ నిర్వహించిన టెస్ట్ చట్టబద్ధంగా ఆమోదయోగ్యం కాదని.. నాసిరకం ప్రయోగశాల తమ ఉత్తమ నాణ్యత గల ఆవు నెయ్యిని నాణ్యత లేనిదిగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని మండిపడింది.
పరీక్ష సమయంలో గడువు ముగిసిన ఉత్పత్తి
శాంపిల్‌ను తిరిగి పరీక్షించినప్పుడు ఉత్పత్తి యొక్క గడువు అప్పటికే ముగిసిందని కంపెనీ ప్రశ్నించింది.
RM విలువపై స్పష్టీకరణ
కోర్టు ఉత్తర్వులో నెయ్యి తినడానికి హానికరం అని ఎక్కడా పేర్కొనలేదని పతంజలి స్పష్టం చేసింది. ఆర్డర్ కేవలం RM విలువ లో స్వల్ప వ్యత్యాసాన్ని మాత్రమే ప్రస్తావించిందని.. ఇది నెయ్యిలోని అస్థిర కొవ్వు ఆమ్లాల స్థాయిని సూచిస్తుందని తెలిపింది. ఇది సహజమైన ప్రక్రియ అని, మానవ శరీరంలో హిమోగ్లోబిన్‌లో స్వల్ప వ్యత్యాసాలు లాగానే ఇది నెయ్యి నాణ్యతను ప్రభావితం చేయదని వివరణ ఇచ్చింది.
ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌లో అప్పీల్
కంపెనీ కీలక వాదనలను పరిగణలోకి తీసుకోకుండా కోర్టు ప్రతికూల ఉత్తర్వు జారీ చేసిందని.. ఇది చట్టబద్ధంగా అన్యాయమని పతంజలి తెలిపింది. ఈ ఉత్తర్వుపై తాము ఫుడ్ సేఫ్టీ ట్రిబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేస్తున్నామని, తమ ఉత్పత్తుల నాణ్యత ఆధారంగా ట్రిబ్యునల్ తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనే విశ్వాసం ఉందని పతంజలి ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




