Online Financial Frauds: ఆన్‌లైన్ ఆర్థిక మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలా..? ఈ చిట్కాలను పాటించండి
దేశంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది బ్యాంకింగ్ రంగానికి సహాయపడటమే కాకుండా కస్టమర్లకు పనిని..
దేశంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది బ్యాంకింగ్ రంగానికి సహాయపడటమే కాకుండా కస్టమర్లకు పనిని సులభతరం చేస్తుంది. అయితే, మోసగాళ్ళు కూడా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, కస్టమర్ల బ్యాంకు ఖాతాల నుండి డబ్బును దొంగిలిస్తున్నారు. మోసగాళ్లు కూడా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే మోసాన్ని నిరోధించడానికి, మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి కస్టమర్‌కు చెందిన వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. లింకులను పంపిస్తూ, బ్యాంకు నుంచి అంటూ ఫోన్‌లు చేస్తూ కస్టమర్ మొబైల్, కంప్యూటర్‌లోని వివరాలన్ని సేకరించి మిమ్మల్ని భయపెట్టి భారీ ఎత్తున డబ్బును సమర్పించాలని డిమాండ్ చేస్తుంటారు. దీని వల్ల నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయే ప్రమాదం ఉంది.
అటువంటి మోసాలను నిరోధించడానికి అసురక్షిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని టెక్ నిపుణులు, బ్యాంకు అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పామ్ మెయిల్స్ లేదా తెలియని వెబ్‌సైట్‌లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. కొన్నిసార్లు మోసగాళ్లు బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థ పేరుతో కాల్ చేసి వ్యక్తిగత సమాచారం లేదా ఇతర వివరాలను అడగవచ్చు. లింక్‌లను బలవంతంగా క్లిక్ చేయవచ్చు. కానీ, ఇలా చేయవద్దు.
మోసగాళ్లు వినియోగదారుకు తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే మరొక పద్ధతి ఇది. కస్టమర్లకు మెసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతుంటారు. టెలికాం ఆపరేటర్లమంటూ ఫోన్‌లు చేస్తూ మీ సిమ్‌కార్డు బ్లాక్ అవుతుందని, భద్రత కోసం కొత్త సిమ్ కార్డును మార్చుకోవాలని సూచిస్తుంటారు. కొత్త సిమ్ తీసుకుని పాత సిమ్ డిస్ కనెక్ట్ అయిన తర్వాత స్కామర్ నెట్‌వర్క్‌ని ఉపయోగించుకుని కస్టమర్ బ్యాంక్ ఖాతా ఓటీపీ పొంది డబ్బును దొంగిలిస్తుంటారు.ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితోనూ వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని సూచిస్తున్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ స్కామ్
ఇక్కడ మోసగాళ్లు డబ్బును స్వీకరించడానికి లేదా బ్యాంక్ ఖాతాలో మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత డబ్బు డిపాజిట్ కాకుండా మీ ఖాతా నుండి కట్ అవుతుంది. చాలా సందర్భాల్లో మోసగాళ్లు మంచి వ్యక్తులుగా నటిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. వినియోగదారుడు స్కాన్ చేసి OTPని నమోదు చేసిన వెంటనే, మోసగాళ్ళు భారీ మొత్తంలో డబ్బును ఉపసంహరించుకుంటారు. ఎవరో ఫోన్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సూచించినా ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దు. అనుమానాస్పద వ్యక్తుల దగ్గర క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు. రెస్టారెంట్లు, మాల్స్, విశ్వసనీయ ప్రదేశాలలో మాత్రమే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. యూపీఐ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి