సెబీ గ్రీన్ సిగ్నల్.. ఐపీవోకు రాబోతోన్న నురేకా, వంద కోట్ల సమీకరణ లక్ష్యం, ఫిబ్రవరి 15 నుంచి షురూ

ఈ ఏడాది అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికిగాను పెట్టుబడులు సమీకరించుకునేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళుతున్నాయి...

సెబీ గ్రీన్ సిగ్నల్.. ఐపీవోకు రాబోతోన్న నురేకా, వంద కోట్ల సమీకరణ లక్ష్యం, ఫిబ్రవరి 15 నుంచి షురూ
Follow us

|

Updated on: Feb 11, 2021 | 5:18 PM

ఈ ఏడాది అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికిగాను పెట్టుబడులు సమీకరించుకునేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళుతున్నాయి. ఇప్పటికే ఎల్ఐసీ తోపాటు, కళ్యాణ్ జ్యువెలర్స్, పేటీఎం, ఓలా, బజాజ్ ఎనర్జీ, బై జూస్, పాలసీబజార్, జోమాటో, ఇ-లాజిస్టిక్స్, బార్బెక్యూ నేషన్.. ఇలా అనేక కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గాను పెట్టుబడులు సమీకరించుకునేందుకు ఐపీవో కు వెళ్తున్నట్టు ప్రకటించేశాయి. తాజాగా ఇప్పుడు హోం హెల్త్ కేర్ ఉత్పత్తుల సంస్థ ‘నురేకా లిమిటెడ్’ కూడా త్వరలోనే ఐపీఓకు వెళ్తోంది. తద్వారా రూ .100 కోట్ల మేర పెట్టుబడులు పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించబోతోంది.

సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) యొక్క గో-ఫార్వర్డ్ అనుమతులు అందుకున్న నేపథ్యంలో నురేకా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ)కు వెళ్లేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే వారం అంటే, ఫిబ్రవరి 15, 2021 న ఐపీవో తెరవబడుతుంది. నురేకా లిమిటెడ్ షేర్ ఒక్కొక్కటి 10 రూపాయల ముఖ విలువతో విక్రయించబడుతుంది. ఫిబ్రవరి 17, 2021 న ఐపీవో ముగుస్తుంది.

అమెరికా కేంద్రంగా గల నురేకా సంస్థకు ఇండియాలో ఛండీఘర్, ముంబయ్ లో కార్యాలయాలున్నాయి. భారతదేశంతోపాటు అనేక దేశాలలో నురేకా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన టెస్టింగ్ కిట్స్, తల్లి, పిల్లల సంరక్షణ, ఇంకా ఆర్థోపెడిక్ ఉత్పత్తులను నురేకా సంస్థ తయారు చేస్తుంది. తమ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలైన డాక్టర్ ట్రస్ట్, ట్రూమామ్, డాక్టర్ ఫిజియో ద్వారా ఉత్పత్తులను అమ్ముతోంది నురేకా సంస్థ. 2019లో టాటా గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమాతో నురేకా చేతులు కలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా దుకాణాల ద్వారా నురేకా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

2020-21 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో నురేకా కంపెనీ అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. కోవిడ్ -19 మహమ్మారి భయం వల్ల కావచ్చు, రోగులు ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లేందుకు సుముఖంగా ఉండకపోవడం వల్ల కావొచ్చు నురేకా ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కాగా, నికర ఇష్యూలో 75 శాతం వరకు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (క్యూఐబి) కేటాయించబడుతుంది.

రిటైల్ పెట్టుబడిదారులకు ఇష్యూలో 10 శాతానికి మించకుండా, మిగిలిన 15 శాతం సంస్థేతర వర్గానికి నురేకా కేటాయించింది. అర్హతగల ఉద్యోగుల కోసం రూ .50 లక్షల విలువైన ఈక్విటీ షేర్ల రిజర్వేషన్ కూడా ప్రాస్పెక్టస్ లో వెల్లడించారు. ఉద్యోగుల రిజర్వేషన్ భాగంలో బిడ్డింగ్ అర్హత కలిగిన ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ .20 తగ్గింపును అందిస్తున్నారు. మార్చి 2019 నుండి 2020 మార్చి వరకు నురేకా సంస్థ ఆదాయం దాదాపు 60% పెరిగింది. ఈ రంగం ఎఫ్‌ఎమ్‌సిజి యొక్క విస్తృత వర్గంలో ఉండటం, రక్షణాత్మక స్టాక్ కావడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు.

Read also : ఆంధ్రప్రదేశ్ జీవనాడి ఇక సాకారం, అతి త్వరలోనే సాగు, తాగునీటిని అందించే బృహత్తర ప్రాజెక్టు ఆవిష్కృతం