Maruti Suzuki Invicto: ఇన్నోవాకు పోటీగా ఇన్విక్టో.. మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మారుతీ సుజుకీ కొత్త కారు ఇదే..
మారుతీ సుజుకీ ఓ కొత్త కారును లాంచ్ చేసింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన కారుగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ కారు టోయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హై క్రాస్ ఎంపీవీకి రీ బ్యాడ్జెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అయితే మారుతీ సుజుకీ ఇన్నోవా హై క్రాస్ మోడల్ కి కొన్ని మార్పులైతే చేసింది.
మన దేశంలో అత్యధికశాతం మంది విశ్వసించే కార్ల బ్రాండ్ మారుతీ సుజుకీ. ఈ కంపెనీ కార్లకే ఇక్కడ డిమాండ్ ఎక్కువ. అయితే మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) ఇప్పటి వరకూ మారుతీ సుజుకీ నుంచి లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చుతూ బుధవారం ఓ కొత్త కారును లాంచ్ చేసింది. ఇది మన దేశంలోనే అత్యంత ఖరీదైన కారుగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ కారు టోయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హై క్రాస్ ఎంపీవీకి రీ బ్యాడ్జెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అయితే మారుతీ సుజుకీ ఇన్నోవా హై క్రాస్ మోడల్ కి కొన్ని మార్పులైతే చేసింది. ముఖ్యంగా ముందు వైపు బంపర్ విషయంలో కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మూడు వేరియంట్లలో..
మారుతీ సుజుకీ ఇన్విక్టో కారు మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. జీటా ప్లస్(7 సీటర్), జీటా ప్లస్(8సీటరఱ్) ఆల్ఫా ప్లస్(7 సీటర్). వీటి ధరలు ప్రస్తుతం ఉన్న అన్ని మోడళ్ల కంటే అధికమనే చెప్పాలి. మొదటి వేరియంట్ కారు రూ. 24.79లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకూ ఉంటుంది. మిడిల్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు ఉంటుంది. ఇది నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. వాటిల్లో నెక్సా బ్లూ, మిస్టిక్ వైట్ కూడా ఉంటాయి. మారుతీ నుంచి వస్తున్న కొత్త మోడల్ కారు ఇన్విక్టో నెక్సా ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా విక్రయించనున్నారు.
ఇన్విక్టో స్పెసిఫికేషన్లు ఇవి..
ఈ కొత్త కారు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. దీనిలో హై బ్రీడ్ మోటార్ ఉంటుంది. 172 బీహెచ్ పీ, 188ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ-సీబీటీ యూనిట్ ట్రాన్సిమిషన్ అందిస్తుంది. ఈ కారు ఏకంగా 23.24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని తెలుస్తోంది.
ఇంటీరియర్, ఫీచర్లు..
ఇందులో బూట్ స్పేస్ 239 లీటర్లు ఉంటుంది. 10 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్, 7 అంగుళాల డ్రైవర్ డిస్ ప్లే ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. దీనిలోని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ థీమ్ తో వస్తోంది. ఇక భద్రత ఫీచర్ల గురించి చూస్తే దీనిలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేకులు, ఆటో హోల్డ్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
లక్ష్యం దిశగా పయనం..
మారుతీ సుజుకీ చెందిన శశాంక్ శ్రీవాస్తవ గత నెలలో మాట్లాడుతూ ఎస్ యూవీ సెగ్మెంట్ లో 24 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మార్కెట్లో అధికశాతం కొనుగోళ్లను రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది జూన్ నెలలో డోమెస్టిక్ ప్యాసెంజర్ వెహికల్స్ సేల్స్ 8.5శాతం పెరిగాయని ఆయన చెప్పారు. మొత్తం 1,33,027 వాహనాలు మారుతీ సుజుకీ విక్రయించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..