మరో సంచలన నిర్ణయానికి సిద్దమవుతున్న కేంద్రం.. బడ్జెట్‌లో బిగ్ అనౌన్స్‌మెంట్..!
బ్యాంకింగ్ రంగంలో మరో కీలక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరోసారి బ్యాంకుల విలీనం చేసేందుకు సిద్దమవుతోంది. తొలి దశలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం చేయగా.. దీని వల్ల పలు లాభాలు జరిగాయి. దీంతో రెండో విడత బ్యాంకుల విలీనం కూడా చేపట్టనుందని సమాచారం.

Banks Merge: బ్యాంకింగ్ రంగంలో మరో సంచలనానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. రెండో విడత బ్యాంకుల మెగా విలీనం చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. గతంలో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం విలీనం చేయగా.. ఇప్పుడు మలి దశ విడతలో భాగంగా మరో రెండు పెద్ద బ్యాంకులను విలీనం చేసి ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. వాటిని నాలుగుకు తగ్గించింది. దేశంలో రెండే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు రెండో దశలో భాగంగా మరో రెండు బ్యాంకులను విలీనం చేయనుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక్కటి కానున్న ఆ రెండు బ్యాంకులు..?
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటి కానున్నాయి. ఈ రెండు బ్యాంకులను కేంద్రం విలీనం చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే జరిగితే దేశంలో ఎస్‌బీఐ తర్వాత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులుగా అవి నిలవనున్నాయి. త్వరలో ఈ మెగా విలీనం జరగనుందని ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌లో ఈ విలీనం గురించి కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఆలోపే దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ఈ బ్యాంకులు కూడా విలీనం..?
ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి బ్యాంకులను కూడా ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించవచ్చని చెబుతున్నారు. గతంలో బ్యాంకుల విలీనం వల్ల ప్రయోజనం చేకూరిందని, బ్యాంకుల లాభదాయకత పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే రెండో విడతలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేసేందుకు సిద్దమవుతోంది. బ్యాంకుల విలీనం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చుతుందని ప్రభుత్వం అంటుండగా.. బ్యాంక్ సంఘాలు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లకు పలు సమస్యలు ఎదురవుతాయి. చెక్ బుక్స్, ఐఎఫ్‌సీ కోడ్, బ్యాంక్ పాస్‌బుక్‌లు వంటివి మారతాయి. అలాగే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ కూడా మారిపోతాయి. దీని వల్ల కస్టమర్లు కొన్నిరోజులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకుల విలీనంపై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందా..? లేదా బ్యాంకు సంఘాల ఒత్తిడికి తగ్గుతుందా..? అనేది చూడాలి.
🚨 Indian government is planning to merge 'Union Bank of India' and 'Bank of India' to create the second largest state-run bank after SBI. pic.twitter.com/ZFcxggr0Pa
— Indian Tech & Infra (@IndianTechGuide) January 7, 2026
