No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వెనక ఇంత పెద్ద కథ ఉందా.. ఫ్రీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
ఈ రోజుల్లో కొత్త మొబైల్ లేదా టీవీ కొనాలంటే జేబులో రూపాయి లేకపోయినా పర్లేదు.. నో కాస్ట్ ఈఎంఐ ఉందిగా అనుకుంటున్నారు చాలామంది. 0శాతం వడ్డీ, అదనపు ఖర్చుల్లేకుండా నెలవారీ కిస్తీలు అనే బోర్డులు చూడగానే షాపింగ్ ప్రియులు ఎగబడుతున్నారు. కానీ బ్యాంకులు, కంపెనీలు నిజంగానే వడ్డీ లేకుండా ఉచితంగా లోన్ ఇస్తాయా? లేక కంటికి కనిపించని లాభాల ఆట ఏదైనా ఆడుతున్నాయా? అనేది తెలుసుకుందాం..

ఈ రోజుల్లో మొబైల్స్, టీవీలు, లాప్‌టాప్‌లు లేదా ఇతర ఖరీదైన వస్తువులను కొనడం చాలా ఈజీ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం షాపింగ్ వెబ్‌సైట్లలో, ఆఫ్‌లైన్ స్టోర్లలో కనిపించే నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లే. 0శాతం వడ్డీ, అదనపు ఖర్చుల్లేకుండా ఈఎంఐ అనే ప్రకటనలు చూడగానే చాలామంది వెంటనే వస్తువులను కొనేస్తుంటారు. కానీ నో కాస్ట్ ఈఎంఐ నిజంగానే ఉచితమా? దీని వెనుక దాగున్న నిజాలు చాలా మందికి తెలియవు. క్లియర్‌గా చెప్పాలంటే.. ఒకేసారి మొత్తం డబ్బులు చెల్లించకుండా.. ప్రతి నెలా వాయిదాలలో బిల్లును చెల్లించడమే నో కాస్ట్ ఈఎంఐ. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదని బ్యాంకులు, కంపెనీలు చెప్తుంటాయి. ఉదాహరణకు.. మీరు రూ.30,000 మొబైల్‌ను 10 నెలల నో కాస్ట్ ఈఎంఐపై కొంటే.. నెలకు రూ.3,000 చొప్పున కడితే సరిపోతుందని భావిస్తారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది.
కంపెనీలు, బ్యాంకులు ఎలా సంపాదిస్తాయి?
వడ్డీ లేనప్పుడు బ్యాంకులకు లాభం ఏంటనే డౌట్ అందరికీ వస్తుంది. ఇక్కడే కంపెనీలు స్మార్ట్ గేమ్ ప్లే చేస్తాయి..
డిస్కౌంట్ మాయాజాలం: మీరు ఒకేసారి నగదు చెల్లించి కొంటే మీకు దక్కే క్యాష్ డిస్కౌంట్‌ను, ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు కట్ చేస్తారు. అంటే ఆ డిస్కౌంట్ మొత్తాన్ని వడ్డీ రూపంలో బ్యాంకుకు సర్దుబాటు చేస్తారన్నమాట.
హిడన్ ఛార్జీలు: నో కాస్ట్ ఈఎంఐ పేరుతో బ్యాంకులు రూ.99 నుండి రూ.299 వరకు వన్ టైమ్ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.
18 శాతం జీఎస్టీ: అన్నింటికంటే ముఖ్యంగా, నో కాస్ట్ ఈఎంఐ కింద బ్యాంకు లెక్కించే వడ్డీ భాగంపై ప్రభుత్వం విధించే 18శాతం జీఎస్టీని నేరుగా మీ జేబు నుండే వసూలు చేస్తారు.
ప్రీ-క్లోజర్ ఛార్జీలు: ఒకవేళ మీరు ఈఎంఐని మధ్యలోనే పూర్తిగా కట్టేసి క్లోజ్ చేయాలనుకుంటే, బ్యాంకులు 2శాతం నుండి 3శాతం వరకు ప్రీ క్లోజర్ ఛార్జీలు వేస్తాయి.
ఈ చిన్న చిన్న ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే.. ఆ ఉచిత లోన్ కాస్తా వార్షికంగా 12శాతం నుండి 15శాతం వరకు పెను భారంగా మారుతుంది.
చిన్న ఈఎంఐ.. పెద్ద ఖర్చు
మీ బడ్జెట్ రూ.15,000 అనుకుందాం. కానీ షాపింగ్ మాల్‌లో సేల్స్ పర్సన్ ‘‘సార్.. రూ.30,000 ఫోన్ నెలకు కేవలం రూ.2,500 ఈఎంఐకే వస్తుంది’’ అని చెప్పగానే చాలామంది బడ్జెట్ దాటి కొనేస్తారు. దీన్నే సైకాలజీలో ఇంపల్స్ బయింగ్ అంటారు. నగదు రూపంలో ఒకేసారి పెద్ద మొత్తం ఇవ్వక్కర్లేదు కాబట్టి మన మెదడు ఆ ఖర్చును చాలా చిన్నదిగా భ్రమిస్తుంది. ఫలితంగా ఈరోజు మొబైల్, వచ్చే నెల టీవీ, ఆపై నెల ఫ్రిజ్.. ఇలా వరుసగా ఈఎంఐలు పెంచుకుంటూ పోతారు. మొదట్లో ఇవన్నీ చిన్నవిగా అనిపించినా, చివరికి నెలకు వేల రూపాయలు ఈఎంఐలకే కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ఉద్యోగం పోయినా లేదా ఆదాయం తగ్గినా ఆర్థిక సంక్షోభంలో పడిపోతారు.
సిబిల్ స్కోర్‌పై ప్రభావం
నో కాస్ట్ ఈఎంఐ అనేది కూడా ఒక రకమైన లోనే. మీరు ఈఎంఐలను సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది. కానీ ఒక్క ఈఎంఐ ఆలస్యమైనా భారీగా లేట్ ఫీజు పడటమే కాకుండా మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో అత్యవసరమైన హోమ్ లోన్ లేదా కార్ లోన్ రావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
షాపింగ్‌కు వెళ్లే ముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..
- ఈఎంఐ మొత్తాన్ని మాత్రమే కాదు.. వస్తువు యొక్క మొత్తం అసలు ధరను కూడా లెక్కించండి.
- ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ మరియు ఇతర హిడన్ ఛార్జీలు ఎంత ఉన్నాయో ముందే తనిఖీ చేయండి.
- ఆఫర్ నియమ నిబంధనలను పూర్తిగా చదవండి.
- మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను బట్టి భరించగలిగే ఈఎంఐలను మాత్రమే ఎంచుకోండి.
- ఆఫర్లు ఉన్నాయి కదా అని కాకుండా మీ అవసరాన్ని బట్టి మాత్రమే వస్తువులు కొనండి.
