Income Tax: చనిపోయిన వ్యక్తి పేరుపై ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలా? వారసులు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే..!
ప్రస్తుతం భారతదేశంలో ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ కొనసాగుతోంది. దాదాపు వారం రోజుల్లో 14.5 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు. మీ ఆదాయాన్ని ఆదాయపు పన్ను విభాగానికి నివేదించడం చట్టపరమైన బాధ్యత కాబట్టి మరణించిన వ్యక్తులకు కూడా ఇది వర్తిస్తుందా? అనే అనుమానం అందరికీ వస్తుంది. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తి విషయంలో ఐటీఆర్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.

ఎవరైనా వ్యక్తి మరణించిన తేదీ వరకు ఆదాయ పరిమితులు చేరుకుంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం చట్టబద్ధంగా అవసరం. ఆ వ్యక్తికి సంబంధించి చట్టపరమైన వారసులు ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తి మరణించిన తేదీ వరకు సంపాదించిన ఆదాయానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడం తప్పనిసరి. మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఉంటే లేదా ఐటీ చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
మరణించిన వ్యక్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1, 2024-మార్చి 31, 2025) ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తే వారి ఐటీఆర్ 2025-26 ఆర్థిక సంవత్సారానికి దాఖలు చేయాలి. అయితే చట్టపరమైన వారసుడు లేదా ప్రతినిధి అంటే జీవిత భాగస్వామి, కొడుకు లేదా కూతురు, వీలునామాలో పేరున్న వ్యక్తి, కోర్టు నియమించిన చట్టపరమైన ప్రతినిధి (ఏదైనా వివాదం ఉంటే) దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని కోసం వారసుడు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చట్టపరమైన వారసుడిగా నమోదు చేసుకోవాలి. రిటర్న్ దాఖలు చేయడానికి చట్టపరమైన వారసుడిని అని ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. మరణించిన వ్యక్తి, చట్టపరమైన వారసుడు ఇద్దరి పాన్‌ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అయితే మరణించిన వ్యక్తి పాన్ నమోదు చేయకపోతే, చట్టపరమైన వారసుడు మరణించిన వ్యక్తి తరపున నమోదు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరణించిన వ్యక్తికి వర్తించే ఐటీఆర్ ఫారమ్, ఇతర అసెస్సీల మాదిరిగానే, సంబంధిత కాలంలో సంపాదించిన ఆదాయం యొక్క స్వభావం, కూర్పు ఆధారంగా నిర్ణయిస్తారు.
- ఐటీఆర్-1 (సహజ్): జీతం, ఒక ఇంటి ఆస్తి, వడ్డీ ఆదాయం
- ఐటీఆర్-2: మూలధన లాభాలు లేదా బహుళ గృహ ఆస్తుల కోసం
- ఐటీఆర్-3 / ఐటీఆర్-4: మరణించిన వ్యక్తికి వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం ఉంటే
ఐటీఆర్‌ను మరణించిన వ్యక్తి పేరిట దాఖలు చేయాలి. కానీ దానిని చట్టపరమైన వారసుడు ధ్రువీకరించాలి. వ్యక్తులకు (చట్టపరమైన వారసులతో సహా) ఏవై 2025-26 కోసం గడువు సెప్టెంబర్ 15, 2025గా ఉంది. అయితే మరణించిన వ్యక్తికి వ్యాపార ఆదాయం ఉంటే, ఆడిట్ వర్తిస్తే, గడువు అక్టోబర్ 31, 2025గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








