గుడ్‌న్యూస్.. త్వరలోనే చౌకగా ముడిచమురు? ఆ రెండు దేశాల మధ్య చర్చలు!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం: అమెరికా ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు సిద్ధంగా ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఇరాన్ అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, దీర్ఘకాలిక హామీ కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ చర్చల ఫలితాలపై ప్రపంచ ఇంధన మార్కెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం, ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను తాత్కాలికంగా సడలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం వెలువడింది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలకు సంబంధించిన కొత్త ముసాయిదాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు ప్రతిపాదనలతో పోలిస్తే, ఈసారి చర్చల సమయంలో కొంతవరకు ఆంక్షలను ఎత్తివేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొంది.
అయితే ఇరాన్ మాత్రం మరింత ముందుకు వెళ్లి, ఏదైనా దీర్ఘకాలిక ఒప్పందం కుదిరే ముందు అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా అమెరికా ఒప్పందాన్ని కొనసాగిస్తుందనే హామీ కావాలని టెహ్రాన్ పట్టుబడుతోంది. ప్రస్తుతం అమెరికా మాత్రం తాత్కాలిక మినహాయింపుల వ్యవస్థను మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో రాయిటర్స్ కథనం ప్రకారం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఇరాన్ ఒక సవరించిన ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు పూర్తిస్థాయి ఒప్పందానికి దారితీయకపోయినా, ఇరుపక్షాలు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఇరాన్‌కు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌కు సమయం చాలా తక్కువగా ఉంది. త్వరగా స్పందించాలి. లేదంటే వారికి ఏమీ మిగలదు అని ఆయన వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్ చమురు మళ్లీ అంతర్జాతీయ మార్కెట్‌లోకి వస్తే, ప్రపంచ సరఫరా గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సాఫీగా జరిగే అవకాశాలు మెరుగుపడతాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం గల్ఫ్ ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 109.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) చమురు ధర బ్యారెల్‌కు 105.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విశ్లేషకులు మాత్రం అమెరికా–ఇరాన్ చర్చల ఫలితాలపై వచ్చే రోజుల్లో ప్రపంచ ఇంధన మార్కెట్ దిశ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
