Gold Investment: బంగారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? గోల్డెన్ ఛాన్స్.. ఐదు రోజులు మాత్రమే.. డోంట్ మిస్!
బంగారం 24 క్యారెట్లు ప్రస్తుతం పది గ్రాములకు దాదాపుగా 52 వేల రూపాయల వద్ద ఉంది. కొంతకాలంగా కొద్దిగా అటూ ఇటూగా ఇదే రేటు మారుతూ వస్తోంది. భవిష్యత్ లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Gold Investment: బంగారం 24 క్యారెట్లు ప్రస్తుతం పది గ్రాములకు దాదాపుగా 52 వేల రూపాయల వద్ద ఉంది. కొంతకాలంగా కొద్దిగా అటూ ఇటూగా ఇదే రేటు మారుతూ వస్తోంది. భవిష్యత్ లో బంగారం ధర (Gold Price) మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగే రూపాయి విలువ కూడా రికార్డు పతనం సూచిస్తోంది. స్టాక్ మార్కెట్లు (Stock Markets) కుదేలయిపోయాయి. ఈ నేపద్యంలో బంగారం కచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికోసం పెద్ద గుడ్ న్యూస్ ఇక్కడ ఉంది.
సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం మరోసారి మీకు అవకాశం కల్పిస్తోంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022-23 మొదటి విడతలో 20 నుంచి 24 జూన్ వరకు అంటే 5 రోజుల పాటు కొనుగోలు కోసం ఓపెన్ చేస్తారు. దీని ఇష్యూ ధర గ్రాముకు రూ.5,091గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, డిజిటల్ చెల్లింపు చేసేవారి కోసం గ్రాముకు రూ.50 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 1 గ్రాము బంగారానికి రూ.5,041 చెల్లించాల్సి ఉంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ..
అసలు సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏమిటి అనేది ఒకసారి చెప్పుకుందాం.. సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ప్రభుత్వ బాండ్, దీనిని RBI జారీ చేస్తుంది. దీన్ని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. దాని విలువ బంగారం బరువులో ఉంటుంది. బాండ్ విలువ ఐదు గ్రాముల బంగారం అయితే, బాండ్ విలువ ఐదు గ్రాముల బంగారం ధరతో సమానంగా ఉంటుంది. కొనుగోలు కోసం ఇష్యూ ధరను సెబీ అధీకృత బ్రోకర్‌కు చెల్లించాలి. అలాగే బాండ్ తిరిగి విక్రయించిన తర్వాత, ఇన్వెస్టర్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరపై ప్రతి సంవత్సరం 2.50% స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డబ్బు ప్రతి 6 నెలలకు మీ ఎకౌంట్ కు జమ అవుతుంది. అయితే దానిపై శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్యూరిటీ.. సేఫ్టీ..
సావరిన్ గోల్డ్ బాండ్లలో స్వచ్ఛత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రకారం, గోల్డ్ బాండ్ల ధర ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించిన 24 క్యారెట్ల స్వచ్ఛత బంగారం ధరతో ముడిపడి ఉంది. దీనితో పాటు, దీనిని డీమ్యాట్ రూపంలో ఉంచవచ్చు, ఇది చాలా సురక్షితమైనది. అలాగే దానిపై ఎటువంటి ఖర్చు ఉండదు.
టాక్స్..
సావరిన్ బాండ్స్ లో 8 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత వచ్చే లాభాలపై టాక్స్ ఉండదు. మరోవైపు, మీరు 5 సంవత్సరాల తర్వాత మీ డబ్బును ఉపసంహరించుకుంటే, దాని నుండి వచ్చే లాభం 20.80% వద్ద దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG)గా టాక్స్ విధిస్తారు.
ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయవచ్చు..
ఇందులో పెట్టుబడి పెట్టడానికి RBI అనేక ఎంపికలను ఇచ్చింది. బ్యాంకు శాఖలు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడిదారు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దీని తర్వాత డబ్బు మీ ఖాతా నుంచి కట్ అవుతుంది. అదే సమయంలో ఈ బాండ్‌లు మీ డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి.
బాండ్లను అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL), గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (BSE) ద్వారా విక్రయిస్తారు.
లాభదాయకమేనా?
అందులో పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా అనే ప్రశ్న తలెత్తవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్‌లో తగ్గుదల కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం 55 వేలకు చేరుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ పథకంలో పెట్టుబడి పెట్టదానికి ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మీరు పెట్టుబడి పెట్టెముందు మీ పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్ సూచనలు తీసుకోవడం తప్పనిసరి. మీ పహనాన్షియల్ ఎడ్వయిజర్ సూచించిన విధంగా సావరిన్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
గమనిక: ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడూ రిస్క్ తో కూడుకుని ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ పాఠకుల ప్రాధమిక అవగాహన కోసం ఇచ్చింది మాత్రమే. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ ఎడ్వయిజర్ సలహా తీసుకోవడం తప్పనిసరి అని టీవీ9 సూచిస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం టీవీ9 నెట్ వర్క్ అందిస్తున్న మనీ9 తెలుగు యూట్యూబ్ ఛానెల్ చూడండి: