Infosys: గుడ్ న్యూస్.. విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయం.. ఆ ప్రణాళికలో భాగంగా కంపెనీ నిర్ణయం..
Infosys: ఇన్ఫోసిస్ అందుబాటులో ఉన్న టాలెంట్ ఉద్యోగులకు దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని ప్రారంభించింది. టైర్- II నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు.
Infosys: ఇన్ఫోసిస్ అందుబాటులో ఉన్న టాలెంట్ ఉద్యోగులకు దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని ప్రారంభించింది. టైర్- II నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో సైతం కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ టైర్ -II నగరాల నుంచి ఎక్కువ మంది యువత ఐటీ రంగంలో పనిచేస్తున్నందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు కరోనా తరువాత 60 శాతం మంది ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవటం కూడా ఈ నిర్ణయం వెనుక మరో కారణంగా తెలుస్తోంది.
తమ ఉద్యోగులు చాలా మంది స్వగ్రామాల నుండి పని చేస్తున్నారని, వారు ఇళ్లకు దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నట్లు కంపెనీ గుర్తించింది. వచ్చే క్వార్టర్ నాటికి ఈ కార్యాలయాలు సిద్ధమౌతాయని కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే ఇండోర్, నాగ్‌పూర్‌లలో చిన్న కేంద్రాలను కలిగి ఉంది. కానీ.. ఇప్పుడు కొత్త ప్రణాళికలో భాగంగా కంపెనీ కోయంబత్తూర్, వైజాగ్, కోల్‌కతా, నోయిడాలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి మైక్రో హబ్ లుగా పనిచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్య ఒక శాతం పెరిగింది. 3,15,000 మంది ఉద్యోగుల ఆధారంగా ఇది గత ఏడాది 38.6% కాగా ఇప్పుడు 39.6%గా ఉందని శంకర్ చెప్పారు. ఇంట్లో నుంచి పని చేస్తూ పిల్లలు, కుటుంబాన్ని పర్యవేక్షించాలని అనేక మంది భావించటం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. కంపెనీల్లో ఇప్పుడు మహిళల పాత్ర పెరిగిందని, అందువల్ల ఉద్యోగాలు వీడిన మహిళలను మళ్లీ తిరిగి ఉద్యోగాల్లోకి చేరేలా చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు శంకర్ తెలిపారు.