India GDP Growth: పైపైకి దూసుకుపోతోన్న భారత్ జీడీపీ.. పారిశ్రామిక వర్గాల్లో కొత్త జోష్..

భారత జీడీపీ వృద్ధిరేటు దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గురువారం (ఆగస్టు 31)న జీడీపీ డేటాను విడుదల చేసింది.

India GDP Growth: పైపైకి దూసుకుపోతోన్న భారత్ జీడీపీ.. పారిశ్రామిక వర్గాల్లో కొత్త జోష్..
Indian Economy
Follow us

|

Updated on: Aug 31, 2023 | 6:39 PM

India Economy: భారత జీడీపీ వృద్ధిరేటు దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) గురువారం (ఆగస్టు 31)న జీడీపీ డేటాను విడుదల చేసింది. గత నాలుగు త్రైమాసికాల్లో నమోదైన గరిష్ఠ వృద్ధిరేటు ఇదే కావడం విశేషం. మౌలిక వసతుల రంగంతో పాటు సేవా రంగంలో వృద్ధి రేటు దూసుకుపోతుండడంతో 2023-24 ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్)లో భారత్‌ ఆశాజనకమైన వృద్ధిరేటును నమోదుచేయగలిగింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 6.1 శాతంగానే ఉంది.

  • నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 7.9 శాతంగా నమోదుకాగా..అంతకు ముందు త్రైమాసంలో ఇది 10.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసంలో నిర్మాణ రంగం ఏకంగా 16 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం.
  • అటు ఉత్పాదక రంగం 4.7 శాతం వృద్ధిరేటుతో కాస్త నిరుత్సాహపరిచింది. గత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో ఉత్పాదక రంగ వృద్ధిరేటు 6.1 శాతంగా ఉంది. తొలి త్రైమాస వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.5 శాతంగా ఉంది.
  • మౌలిక వసతుల రంగం జులై నెలలో 8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకోవడం విశేషం. గత ఏడాది ఇదే నెలలో ఇన్ఫ్రా రంగం 4.8 శాతం వృద్ధిరేటును మాత్రమే నమోదుచేసుకుంది.

చైనాకంటే మెరుగైన జీడీపీ వృద్ధిరేటు..

భారత్ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలమైనదిగా ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో చైనా 6.3 శాతం జీడీపీ వృద్ధిరేటును నమోదు చేసుకుంది. దీని కంటే 1.5 శాతం ఎక్కువగా భారత్ అదే కాలానికి 7.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకోవడం విశేషం. ఆసియాలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాను భారత్ వెనక్కి నెట్టడం దేశ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అమెరికా, చైనాతో పాటు పలు దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం లేకపోవడం విశేషం.

2023 సంవత్సరానికి భారత జీడీపీ అంచనాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఇటీవల 6.1 శాతానికి సవరించింది. అంతకు ముందు ఇది 5.9 శాతంగా ఉండే అవకాశముందని ఐఎంఎఫ్ అంచనావేసింది.

 5 శాతానికి పడిపోవచ్చని మాజీ ఆర్బీఐ గవర్నర్ అంచనా..

భారత జీడీపీ వృద్ధిరేటు 2023లో 5 శాతానికి పడిపోయే అవకాశముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అంచనావేశారు. అయితే ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ ఆశాజనకమైన వృద్ధిరేటును నమోదు చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..