Income Tax Returns: రోజుకు కేవలం 40 వేల ఆదాయపు పన్ను రిటర్న్స్..ఇలా అయితే రిటర్న్స్ దాఖలుకు నాలుగేళ్ళు పడుతుంది
Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రభుత్వం కొత్త పోర్టల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్ పనితీరుపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి.
Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రభుత్వం కొత్త పోర్టల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్ పనితీరుపై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు కూడా వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ ద్వారా ప్రతిరోజూ సగటున 40,000 ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు అవుతున్నాయట. ఈ వేగం చాలా తక్కువ. ఎందుకంటే.. దేశంలో ఆరుకోట్ల మంది రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది. ఇదే వేగంతో రిటర్న్స్ దాఖలు అయితే, మొత్తం అన్ని రిటర్న్స్ దాఖలు కావడానికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇదే గతంలో ఉన్న పోర్టల్ లో ఒక్కరోజులో 49 లక్షల ఐటి రిటర్నులు దాఖలు అయ్యేవి. అంటే దాదాపుగా ప్రతి గంటకు 3,87,571 రిటర్న్స్ దాఖలు జరిగేది.
వాస్తవానికి, కొత్త ఐటి పోర్టల్‌లో పనిచేయడంలో చాలా సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఇ-ప్రాసెసింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ వంటి సౌకర్యం కూడా ఇంకా ఇందులో ప్రారంభం కాలేదు. అయితే, సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఇన్ఫోసిస్ బృంద సభ్యులు, ఐసిఎఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) వంటి బాహ్య సంస్థలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. ఈ సమస్యలు త్వరలో తొలగిపోతాయని సీబీడీటీ చెబుతోంది.
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం కోసం జూన్ 7 న కొత్త సైట్ ప్రారంభించారు. మొత్తం 4241 కోట్ల రూపాయలు ఈ వెబ్సైట్ నిర్మాణానికి ఖర్చు చేశారు. అయితే, దీనిని లాంచ్ చేసినప్పటినుంచీ చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. డజనుకు పైగా సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దేశంలో ఒక నెలకు పైగా ఆదాయపు పన్ను, టిడిఎస్ రిటర్న్స్ దాఖలు జరగడం లేదు. ఏడు ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో నాలుగు ఇప్పటికీ పోర్టల్‌లో అందుబాటులో లేవు. ఈ సమస్యలకు సంబంధించి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 22 న పోర్టల్ సృష్టికర్త ఇన్ఫోసిస్ కు ఒక వారం సమయం ఇచ్చారు. అయితే, వారం గడిచిపోయినా సమస్యలు ఇంకా వస్తున్నాయి.
టిడిఎస్ రిటర్న్స్ రిజెక్టెడ్
ఈ విషయంపై చార్టెడ్ అకౌంటెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “కొత్త వెబ్‌సైట్‌లో రిటర్న్స్ దాఖలు చేయడం అవడం లేదు. అలాగే జూలై 3 లోపు దాఖలు చేసిన అన్ని టిడిఎస్ రిటర్న్‌లు కూడా రిజెక్ట్ అయ్యాయి. వాటిని మళ్లీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రాబడి ఆలస్యం కావడంతో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. రిటర్న్స్ దాఖలు చేయకపోవడం వల్ల, బ్యాంకులు తమ ఫైల్‌తో ముందుకు సాగడం లేదు.” అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న వేగంతో ఆరు కోట్ల రిటర్నులు దాఖలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పడుతుందని చార్టెడ్ అకౌంటెంట్స్ అంటున్నారు. రిటర్న్స్ దాఖలు చేయడానికి ప్రభుత్వం పాత పోర్టల్‌ను పునఃప్రారంభిస్తే మంచిదని వారంటున్నారు. క్రొత్త పోర్టల్ సరిగా పనిచేయడం ప్రారంభించే వరకు ఇది నడుస్తూనే ఉండాలని వారు కోరుతున్నారు. పాత పోర్టల్ మూసివేసి కొత్త పోర్టల్ ప్రారంభించడం పెద్ద తప్పు అని వారు అంటున్నారు. కొత్త పోర్టల్ సరిగా పనిచేయడం ప్రారంభించే వరకు రెండు పోర్టల్స్ పక్కపక్కనే నడపడానికి అనుమతించబడి ఉంటే మంచిదని వారు చెబుతున్నారు.
సమయం మించిపోతోంది..
- ఆదాయపు పన్ను చట్టం 1962 లోని రూల్ 31 ప్రకారం, టిడిఎస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చివరి తేదీని 2021 జూలై 31 వరకు పొడిగించారు.
- 2020-21 చివరి త్రైమాసికంలో పన్ను మినహాయింపు ప్రకటనను 1521 జూలై 15 లోగా సమర్పించాలి.
- ఫారం నెం. 2020-21. 64 డిలో, పెట్టుబడి నిధి తరపున ఆదాయపు పన్ను చెల్లింపు లేదా యూనిట్ హోల్డర్ ఖాతాకు జమ చేసిన ప్రకటనను జూలై 15, 2021 లోపు సమర్పించాలి.
- ఫారం నెం. 2020-21. 64 సి లో, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తరపున ఆదాయపు పన్ను చెల్లింపు లేదా యూనిట్ హోల్డర్ ఖాతాకు జమ చేసిన ప్రకటనను జూలై 15, 2021 లోపు సమర్పించాలి.
- పెండింగ్‌లో ఉన్న దరఖాస్తును ఉపసంహరించుకునే ఎంపికను 31 జూలై 2021 వరకు (ఆదాయపు పన్ను పరిష్కార కమిషన్) ఉపయోగించుకోవచ్చు.
ఇన్ని పనులు జూలైలో పూర్తి కావాల్సి ఉంది. కానీ, పోర్టల్ లో ప్రస్తుతం ఉన్న సమస్యలతో వీటిని ఎంతవరకూ ప్రజలు పూర్తి చేయగలరనేది ప్రస్తుతం ఉన్న ప్రశ్న.