UPI Block Mechanism: సెబీ ‘బ్లాక్’ బస్టర్ నిర్ణయం.. ఇన్వెస్టర్లకు ఇక పండగే..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) బ్లాక్ మెకానిజమ్ వల్ల పెట్టుబడి దారులకు భద్రత లభిస్తుంది. పెట్టుబడులను తమ స్టాక్ బ్రోకర్లకు ముందుగా బదిలీ చేయనవసరం లేదు. వ్యాపారం కోసం తమ ఖాతాలో నగదును బ్లాక్ చేసుకోవచ్చు. ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం 2019లో ఈ వ్యవస్థను తీసుకువచ్చారు.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త ప్రతిపాదన రూపొందించింది. సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం యూపీఐ బ్లాక్ మెకానిజం ప్రవేశపెట్టాలని ఆదేశించింది. క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (క్యూఎస్‌బీలు) ఈ యూపీఐ బ్లాక్ మెకానిజాన్ని ఉపయోగించి ట్రేడింగ్ చేసే సౌకర్యాన్ని అందించాలని భావిస్తోంది. ఇప్పటి వరకూ సెకండరీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్ అమౌంట్ (ఏఎస్బీఏ) సదుపాయం మాదిరిగానే యూపీఐ బ్లాక్ మెకానిజాన్ని ఉపయోగించాలని ఆదేశించింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలే లక్ష్యంగా సెబీ తీసుకువచ్చిన కొత్త నిబంధన గురించి తెలుసుకుందాం.
ఏఎస్బీఏ సదుపాయం అంటే..
ఏఎస్బీఏ సదుపాయం అంటే ఈ విధానంలో బ్లాక్ చేసిన మొత్తాలతో వ్యాపారానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్ధతి ట్రేడింగ్ సభ్యులకు ఐచ్ఛికంగా ఉంది. దీనివల్ల ఖాతాదారుడి నిధులు, సెక్యూరిటీలకు మెరుగైన రక్షణను లభిస్తుంది. ప్రాథమిక మార్కెట్‌లో కేటాయింపు పూర్తయినప్పుడు మాత్రమే పెట్టుబడిదారుడి నుంచి డబ్బు తరలించబడుతుంది.
యూపీఐ బ్లాక్ మెకానిజం..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) బ్లాక్ మెకానిజమ్ వల్ల పెట్టుబడి దారులకు భద్రత లభిస్తుంది. పెట్టుబడులను తమ స్టాక్ బ్రోకర్లకు ముందుగా బదిలీ చేయనవసరం లేదు. వ్యాపారం కోసం తమ ఖాతాలో నగదును బ్లాక్ చేసుకోవచ్చు. ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం 2019లో ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇన్వెస్టర్ల డబ్బులను రక్షించడానికి, బ్రోకర్ డిఫాల్ట్ ల నుంచి భద్రతకు ఈ విధానం ఎంతో దోహదపడుతుంది. పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ఇప్పటి వరకూ యూపీఐ బ్లాక్ మెకానిజం ఐచ్చికంగా ఉంది. దీన్ని తప్పనిసరి చేయాలని సెబీ లేటెస్ట్ గా ప్రతిపాదనలు చేసింది. దీనివల్ల ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతాలలో నిధులు అలాగే ఉంటాయి. దుర్వినియోగం జరగదు.
ప్రయోజనాలు..
- క్యూఎస్బీలు కొన్ని నిబంధనలను తప్పనిసరిగా అనుసరించడమే లక్ష్యంగా సెబీ కొత్త ప్రతిపాదన చేసింది. దీనివల్ల పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
- పెట్టుబడిదారులు సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం తమ సొంత బ్యాంకు ఖాతాలో నిధులను బ్లాక్ చేయగలరు. ఇది పెట్టుబడిదారునికి నగదుకు మెరుగైన రక్షణ కల్పిస్తుంది. అలాగే వాటిపై వడ్డీని సంపాదించడానికి అనుమతినిస్తుంది. అలాగే వారికి మెరుగైన భద్రత కలుగుతుంది.
- ట్రేడింగ్ మెంబర్ డిఫాల్ట్ విషయంలో ఫండ్స్, సెక్యూరిటీలను అవాంతరాలు లేకుండా తక్షణమే వాపసు పొందవచ్చు.
- టీఎం డిఫాల్ట్ విషయంలో కూడా చెల్లింపుపై ప్రభావం ఉండదు, మరొక టీఎంకి పోర్టింగ్ సౌలభ్యం కల్పించవచ్చు.
- పొదుపు ఖాతా నుంచి బ్లాక్ చేసిన ఫండ్స్ పెట్టుబడిదారునికి వడ్డీని అందిస్తాయి. అయితే ఈ ప్రతిపాదనలపై సెప్టెంబర్ 12 వరకు ప్రజల అభిప్రాయాలను సెబీ కోరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..