Indian Railways: స్నేహితులతో కలసి టూర్ ప్లాన్ చేస్తున్నారా? రైలు బోగి మొత్తం బుక్ చేసుకొనే అవకాశం.. వివరాలు ఇవి..
మన ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా కుటుంబాలుగా లాంగ్ టూర్లకు వెళ్తున్నప్పుడు బస్సులు, ప్రైవేటు కార్లు బుక్ చేసుకోవడం మనకు తెలుసు. కానీ ఓ రైలు బండినే బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండి నిజమే మీరు పెద్ద గ్రూప్ గా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకున్నప్పుడు ఏకంగా...

పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. కుటుంబాలుగా టూర్లు వెళ్లడానికి ఇదే సరైన సమయం. సాధారణంగా మన ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదా కుటుంబాలుగా లాంగ్ టూర్లకు వెళ్తున్నప్పుడు బస్సులు, ప్రైవేటు కార్లు బుక్ చేసుకోవడం మనకు తెలుసు. కానీ ఓ రైలు బండినే బుక్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండి నిజమే మీరు పెద్ద గ్రూప్ గా ఎక్కడికైనా టూర్ వెళ్లాలనుకున్నప్పుడు ఏకంగా రైలు బండి లేదా ఓ రైలు బోగిని బుక్ చేసుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందినవారు లేదా విద్యా సంస్థకు చెందినవారు లేదా ఒక బృందంగా టూర్ వెళ్తున్నవారు రైలులో ఒక బోగీని తమకు బుక్ చేసుకోవచ్చు. సాధారణ బుకింగ్ ద్వారా అందరు రైలులో టికెట్స్ బుక్ చేస్తే వేర్వేరు బోగీల్లో బెర్తులు కన్ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఒక బోగీ బుక్ చేసుకుంటే అందరూ ఆ కోచ్‌లోనే ప్రయాణించవచ్చు. ఇలా ఒక కోచ్ మాత్రమే కాదు అవసరమైతే రైలు మొత్తాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇలా బుక్ చేసుకోవచ్చు..
- బృందంగా రైలు బోగీ లేదా రైలు బండినే బుక్ చేసుకొనే విధానాన్ని ఫుల్ టారిఫ్ రేట్(ఎఫ్‌టీఆర్) బుకింగ్ అంటారు.
- ఒక వ్యక్తి లేదా సంస్థ.. ఒక రైలు మొత్తాన్ని లేదా కోచ్ మొత్తాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ2-టైర్, ఏసీ 3-టైర్లు, ఏసీ 2 కమ్ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్, ఏసీ సెలూన్, సెకండ్ సీటింగ్ వంటి కోచ్‌లను పూర్తిగా బుక్ చేసుకోవచ్చు.
- ఎఫ్‌టీఆర్ ట్రైన్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించింది. https://www.ftr.irctc.co.in/ వెబ్‌సైట్‌లో మీరు ఒక బోగీ లేదా రైలు బుక్ చేయొచ్చు.
- దీనిలోకి లాగిన్ అయ్యాక ఎఫ్‌టీఆర్ ట్రైన్/ కోచ్ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అందులో మీకు మొత్తం రైలు కావాలంటే రైలు, లేదా కోచ్ ఒక్కటి కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- మీరు రైలు లేదా కోచ్ ఎంచుకున్న తర్వాత ఆ వెబ్‌సైట్ మిమ్మల్ని మరో పేజీకి తీసుకెళుతుంది.
- అక్కడ మీరు వెళ్లాలనుకునే ప్రయాణికుల వివరాలు, ప్రయాణ తేదీ, వారికి అవసరమైన కోచ్ రకం మొదలైన వివరాలను నింపాల్సి ఉంటుంది.
- ఆ వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత మీరు పొందుపర్చిన వివరాల మొత్తాన్ని చెల్లించాల్సిన పేజీకి వెళతారు.
- అక్కడ మీరు ఎంచుకున్న ప్రయాణ గమ్యస్థానాలను బట్టి ఫుల్ టారిఫ్ రేట్ చెల్లిస్తే సరిపోతుంది. మీ బుకింగ్‌కు సంబంధించిన కన్ఫర్మేషన్ వివరాలు మీకు వస్తాయి.
ఎంత మొత్తం చెల్లించాలి..
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఒక కోచ్ మొత్తాన్ని బుక్ చేయాలంటే రూ.50,000 సెక్యూరిటీ పేమెంట్ చేయాలి. ఒకవేళ 18 కోచ్‌లు ఉన్న రైలు మొత్తాన్ని బుక్ చేయాలంటే రూ.9 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. గ్రూప్ టూర్ ప్లాన్ చేసేవారు ప్రయాణానికి 30 రోజుల నుంచి 6 నెలల ముందే కోచ్ లేదా రైలు బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం


