SSY Interest Rate: ఆ పథకం వడ్డీ రేటు మారలేదు.. ఆడపిల్లల తల్లిదండ్రులకు మంచి అవకాశం..
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పథకంపై వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం సవరిస్తుంది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ - జూన్ త్రైమాసికానికి కొత్త వడ్డీ రేటును ప్రకటించింది. ఎటువంటి మార్పులు చేయకుండా 8.2 శాతంగానే ఉంచింది. ఆడపిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.

దేశంలోని ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై). దీనిద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భరోసా అందిస్తుంది. ఈ పథకంలో కనీసం రూ. 250 వార్షిక డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ. 1,50,000 వరకూ జమ చేసుకునే అవకాశం ఉంది. ఏవైనా కారణాలతో డిపాజిట్ చేయకపోతే ఏడాదికి రూ. 50 జరిమానా విధిస్తారు. ఈ పథకంలో ఖాతాను ప్రారంభించిన 21 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి 14 ఏళ్ల వరకూ డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంపై ఎలాంటి రుణసౌకర్యాలు లభించవు. దీనిలో వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి మారుతుంటుంది. ఈ నేపథ్యంలో కొత్త వడ్డీ రేటును ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
8.2 శాతం వడ్డీ రేటు..
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) పథకంపై వడ్డీ రేటును ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం సవరిస్తుంది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికి కొత్త వడ్డీ రేటును ప్రకటించింది. ఎటువంటి మార్పులు చేయకుండా 8.2 శాతంగానే ఉంచింది. ఆడపిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. తల్లిదండ్రులు/ సంరక్షకులు తమ ఆడపిల్లల కోసం జరిమానాతో ఈ ఖాతాలను తెరిచే అవకాశం ఉంది. పదేళ్ల లోపు బాలికల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులందరూ తమ పిల్లల పేరుమీద వీటిని ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఖాతాలు తెరవడానికి వారికి అనుమతి ఉంది.
అవసరమైన పత్రాలు..
- బాలిక పాస్‌పోర్ట్ సైజు పొటో
- గుర్తింపు కార్డు జిరాక్స్
- బర్త్ సర్టిఫికెట్ కాపీ జిరాక్స్
- నివాస రుజువు
అకాల మూసివేత..
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సమృద్ధి యోజన పథకం ఖాతాలను మూసివేయవచ్చు. ఖాతాదారుడు మరణించినా, ఖాతాదారుడి ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన వైద్య పరిస్థితులు ఏర్పడినా, లేదా ఖాతాదారుడి సంరక్షకుని మరణం తదితర కారణాలతో ఎస్ఎస్ వై ఖాతాలను మూసివేయవచ్చు. అయితే ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదేళ్లు పూర్తయ్యేలోపు ఈ పరిస్థితుల కారణంగా ఖాతా ముందస్తు మూసివేతకు అనుమతించరు.
పన్ను ప్రయోజనాలు..
ఈ పథకంలో చేసిన డిపాజిట్లకు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద నమోదు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత వచ్చే వడ్డీకి పన్ను ఉండదు. అంటే పథకంలో పెట్టిన పెట్టుబడి. దానిపై ఇచ్చే వడ్డీ, మెచ్యూరిటీ తర్వాత వచ్చే సొమ్మంతా పన్నుల నుంచి మినహాయించబడతాయి. అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం ద్వారా 80సీ తగ్గింపులకు అనర్హులు అవుతారు.
ఆడపిల్లలకు భద్రత..
ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కలుగుతుంది. వారు పెరిగి పెద్దవారయ్యే సరికీ నిర్ణీత మొత్తంలో డబ్బులు అందుతుంది. వారి చదువుకు, వివాహానికి సాయపడుతుంది. ఈ పథకంపై ఇప్పటికే ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. వారందరూ పెద్ద ఎత్తున ఖాతాలు కూడా ప్రారంభించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








