HDFC Loan Rates: ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ.. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు
ప్రస్తుత రోజుల్లో పెరిగిన ఖర్చులు, అవసరాల నేపథ్యంలో అప్పు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. ముఖ్యంగా వాహనాల కొనుగోలు కోసం రుణాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వివిధ రుణాలను బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రుణాలపై వడ్డీ రేటు తగ్గింపును ప్రకటించింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7, 2025 నుంచిఈ సవరించిన రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ తాజాగా తగ్గింపు రుణంపై వడ్డీ అనేది 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి. ఎంసీఎల్ఆర్‌లో ఈ తగ్గింపు రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానించిన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఈఎంఐ కూడా తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్‌ని 9.20 శాతం నుంచి 5 బీపీఎస్ తగ్గించి 9.15 శాతానికి సవరించింది. అయితే ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు వరుసగా 9.20 శాతం నుంచి 9.30 శాతంగా ఉన్నాయి. ఆరు నెలలు, ఒక సంవత్సరం, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ రేట్లు ఒక్కొక్కటి 5 బీపీఎస్ తగ్గించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (పీఎల్ఆర్) సంవత్సరానికి 17.95 శాతంగా ఉంది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటు 9.45 శాతానికి సెట్ చేశారు. అలాగే గృహ రుణాల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్సటర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానించి ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది.
అడ్జస్టబుల్ రేట్ హెూమ్ లోన్స్ (ఏఆర్‌హెచ్ఎల్) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి. బ్యాంకులు కొంత మందికి ప్రత్యేక గృహ రుణ రేట్లను ఆఫర్ చేస్తూ ఉంటారు. వీరికి రెపో రేటుతో పాటు 2.25 శాతం నుంచి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వడ్డీ రేట్లను 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య వడ్డీ రేటు ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు అని అర్థం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి