GST: బ్రెడ్ నుంచి ఫోన్ల దాక.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే.. సామాన్యులకు బిగ్ రిలీఫ్
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై జీఎస్టీలో 2 శ్లాబులు మాత్రమే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబులు తొలగించారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరటనిస్తూ చాలా వస్తువులపై రేట్లు తగ్గనున్నాయి. ఏ ఏ వస్తువులపై రేట్లు తగ్గుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఒక చారిత్రాత్మక నిర్ణయంతో ముగిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్ను వ్యవస్థను సరళీకృతం చేసేందుకు కీలక సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న 12శాతం, 28శాం జీఎస్టీ స్లాబ్‌లను పూర్తిగా రద్దు చేశారు. ఈ కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. ఇప్పుడు దేశంలో 5శాతం, 18శాతం జీఎస్టీ స్లాబ్‌లు మాత్రమే ఉంటాయి. దీంతో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులపై అదనపు శ్లాబ్‌ను కూడా అమలు చేస్తారు. సాధారణ ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువులపై కేవలం 5శాతం మాత్రమే జీఎస్టీ విధించనున్నారు. ఈ నిర్ణయం ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పిన నెక్ట్స్ జనరేషన్ సంస్కరణలకు ఇది తొలి అడుగు అని ఆమె అభివర్ణించారు.
ఏవి చౌకగా మారాయి?
నిత్యావసరాలు: పనీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి వంటి వాటిపై జీఎస్టీ రేటు 12శాతం నుండి 5శాతానికి తగ్గింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, చెనా వంటి వాటిపై జీఎస్టీ ఉండదు.
ఆహార పదార్థాలు: పాస్తా, నూడుల్స్, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు.
డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై జీఎస్టీ రేటు 12శాతం నుండి 5శాతానికి తగ్గింది.
వైద్యం – ఆరోగ్య సంరక్షణ: 33 రకాల మందులు, ఆరోగ్య పరికరాలు, కళ్లద్దాలు, దృష్టి సంబంధిత పరికరాలపై జీఎస్టీ గణనీయంగా తగ్గించారు. ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం ఒక పెద్ద ఉపశమనం. ట్రాక్టర్లు, బట్టలు, బూట్లు, మరియు పాలరాయి వంటి వాటిపై కూడా పన్ను రేట్లు తగ్గించారు.
సెల్‌ఫోన్లపై జీఎస్టీని 28శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఫ్యాన్లు, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్‌పై జీఎస్టీని 5శాతానికి తగ్గించారు. సిమెంట్‌పై పన్ను 28శాతం నుండి 18శాతంకి తగ్గించారు. టీవీలు , వాషింగ్ మెషీన్లు, ఏసీలపై గతంలో ఉన్న 28శాతం నుండి 18శాతానకి పన్ను తగ్గించారు. చాలా ఎరువులపై జీఎస్టీని 5శాతానికి తగ్గించారు.
ఏవి ఖరీదయ్యాయి?
లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్ వర్తిస్తుంది. కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యూస్‌లపై 40శాతం జీఎస్టీ విధించనున్నారు. పొగాకు, జర్దా, పాన్ మసాలా, ఫ్లేవర్ ఉన్న ప్యాకేజ్డ్ పానీయాలపై 40శాత పన్ను రేటు విధిపెరగనుంది.
ఈ సంస్కరణల ద్వారా ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకృతం చేసి, సామాన్యులకు ఉపశమనం కల్పించే ప్రయత్నం చేసింది. ఈ కొత్త మార్పుల వల్ల మార్కెట్‌లో ధరల తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




