AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పరుగు పెడుతున్న పసిడి ధర.. పసిడి ప్రియులకు ఇక కన్నీళ్లేనా!

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆగేదే లే అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర. ప్రస్తుతానికి 82వేల రూపాయలు దాటేసింది. ఇది ఇంతటితో ఆగుతుందా? లక్షమార్క్‌ను దాటేయడం ఖాయమేనా? మధ్యతరగతి ప్రజలు పసిడి కొనడం ఇక కలేనా? అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి?

Gold Price: పరుగు పెడుతున్న పసిడి ధర.. పసిడి ప్రియులకు ఇక కన్నీళ్లేనా!
Gold
Balaraju Goud
|

Updated on: Jan 22, 2025 | 9:22 PM

Share

ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు బ్రేకు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మకర సంక్రాంతి దగ్గరపడిన బంగారం ధర భారీగా పెరుగుతోంది. హైదారాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 82వేల రూపాయల మార్క్ దాటేసింది. ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.

ట్రంప్ వచ్చి రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్‌మార్కెట్‌లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్‌లు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలామంది స్టాక్‌మార్కెట్‌లు అంత సేఫ్‌ కాదన్న అంచనాతో ఉన్నారు. దీంతో బంగారంపైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్‌గా పసిడి ధర ఆల్‌ టైమ్ రికార్డ్‌ వైపుగా దూసుకెళ్తోంది. అతి త్వరలో లక్ష రూపాయల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

దేశీయ గోల్డ్ రేట్లు ఇంకా పెరుగుతాయా?

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ గోల్డ్ రేట్లు ఇంకా పెరుగుతాయా? బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది? ఫిబ్రవరి 1 తర్వాత బంగారం పయనం ఎటు అన్న చర్చ జోరందుకుంది. బంగారం ధరలు కట్టడి చేసేందుకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సగటు పసడి ప్రియులు కోరుతున్నారు. గతేడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగి వచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు.

దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచే ఆలోచన!

జులై, 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గిచడంతో ఆ తర్వాతి నెల ఆగస్టు 2024లో బంగారం దిగుమతులు 104 శాతం పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23శాతానికి పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు రానున్నాయి. ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్ రేటు సామాన్యులకు అందనంతగా పరుగులు పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి.

బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇందుకు యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు, అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ లాంటి అంశాలు కారణమవుతాయని చెబుతున్నారు. ఫైనల్‌గా పసిడి ధర సామాన్యుడికి అందనంత దూరంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..