AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం కొంటున్నారా? చాలామంది చేసే పొరపాట్లు మీరు చేయకండి..!

Gold Buying Tips: బంగారం కొనుగోలు చేయడం అంటే అది మన భవిష్యత్తు కోసం చేసే ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే సరైన అవగాహన లేకుండా బంగారు నగలు కొంటే నష్టపోవాల్సి ఉంటుంది. హాల్‌మార్క్‌, బిల్లు, మేకింగ్ ఛార్జీలు, రాళ్ల విలువ వంటి అంశాలను ముందుగానే పరిశీలించి కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నష్టాలను నివారించవచ్చు. బంగారం కొనేటప్పుడు తప్పక తీసుకోవాల్సిన కీలక జాగ్రత్తలు తెలుసుకోండి.

Gold: బంగారం కొంటున్నారా? చాలామంది చేసే పొరపాట్లు మీరు చేయకండి..!
Gold Buying TipsImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Jun 18, 2026 | 1:42 PM

Share

బంగారం కొనుగోలు చేయడం ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చాలా మంది పరిగణిస్తారు. అందుకే బంగారం కొంత మేర తగ్గినప్పుడు అందులో పెట్టుబడి పెడుతుంటారు. అయితే బంగారు నగలు కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో నష్టాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన అంశాలు విషయంలో జాగ్రత్త పాటించాలి. చాలా మంది సరైన అవగాహన లేకుండా బంగారు కొనుగోలు సమయంలో చేసే చిన్నచిన్న పొరబాట్లతో నష్టపోతుంటారు. అలా నష్టపోకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

బంగార ఆభరణాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

1. హాల్‌మార్క్‌ గుర్తు తప్పనిసరిగా చూడండి

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు వాటిపై BIS హాల్‌మార్క్‌ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. హాల్‌మార్క్‌ ఉంటేనే మీరు కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతకు ధ్రువీకరణ లభిస్తుంది. మీరు కొనే ఆభరణంలో బంగార స్వచ్ఛత 22 క్యారెట్లా? 18 క్యారెట్లా? వంటి వివరాలు తప్పక తెలుసుకోవాలి.

2. స్వచ్ఛమైన బంగారు నగలకు ప్రాధాన్యం ఇవ్వండి

వీలైనంత వరకు అచ్చంగా బంగారంతో తయారైన నగలను కొనుగోలు చేయడం మంచిది. ఇటువంటి నగలను భవిష్యత్తులో ఎక్స్‌ఛేంజ్‌ లేదా అమ్మినప్పుడు విలువ తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. స్వచ్ఛత తక్కువగా ఉన్న ఆభరణాలు కొంటే.. భవిష్యత్తులో వాటిని ఎక్స్‌ఛేంజ్ చేసినా.. అమ్మినా చాలా తక్కువ మొత్తమే వస్తుంది.

ఇవి కూడా చదవండి

3. స్టోన్స్ పొదిగిన నగలు కొంటున్నారా జాగ్రత్త

రాళ్లు పొదిగిన నగలు కొనుగోలు చేస్తే బంగారం విలువ, రాళ్ల విలువను వేర్వేరుగా బిల్లులో చూపిస్తున్నారో లేదో చూసుకోవాలి. సాధారణంగా రాళ్లకు ఎలాంటి రీసేల్‌ విలువ ఉండదు. ఈ రాళ్ల విలువ కూడా చాలా తక్కువే ఉంటుంది. అందువల్ల రాళ్ల బరువును బంగారం తూకంలో కలపకుండా చూసుకోవాలి. రాళ్ల బరువును కూడా బంగారంతో కలిపి బిల్లింగ్ చేస్తే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. పగడాలు, కెంపులు వంటి కొన్ని రత్నాలకు కొంత రీసేల్‌ విలువ ఉంటుంది.

4. కంప్యూటర్ ఇన్‌వాయిస్‌ మాత్రమే తీసుకోండి

తెల్ల కాగితంపై రాసి ఇచ్చే ఎస్టిమేషన్‌ బిల్లులను తీసుకోకుండా, దుకాణం పేరు, జీఎస్‌టీఐఎన్‌ (GSTIN), బంగారం వివరాలు ఉన్న కంప్యూటర్ ఇన్‌వాయిస్ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. భవిష్యత్తులో నాణ్యతపై వివాదం తలెత్తితే ఇదే చట్టపరమైన ఆధారంగా ఉపయోగపడుతుంది.

5. తరుగు, మజూరీ ఛార్జీలను ముందుగానే తెలుసుకోండి

చాలా నగల దుకాణాల్లో బంగారం ధరతో పాటు తరుగు (Wastage), మజూరీ (Making Charges) పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఈ ఛార్జీలు ఎంత ఉంటాయో అడిగి తెలుసుకోవడం మంచిది.

6. గోల్డ్ స్కీమ్స్‌లో చేరేముందు ఇది తెలుసుకోండి

ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనలేని వారు నెలవారీ గోల్డ్ స్కీమ్స్‌లో చేరుతుంటారు. అయితే ప్రభుత్వం గుర్తింపు పొందిన, విశ్వసనీయమైన నగల సంస్థల్లో మాత్రమే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి.

7. పెట్టుబడి కోసం నగల కంటే నాణేలు లేదా బార్లు మంచివి

కేవలం పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునే వారు నగల కంటే బంగారు నాణేలు (Coins) లేదా బార్లు (Bars) కొనడం ఉత్తమం. వీటిపై మేకింగ్‌ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే డిజిటల్‌ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా బంగారం కొనుగోలు చేసి, అవసరమైతే భౌతిక బంగారంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

Also Read: మీ పిల్లలు భవిష్యత్తులో ధనవంతులు కావాలా? ఇప్పుడే పునాది వేయండి

BIS Care App ద్వారా బంగారం హాల్‌మార్క్‌ వివరాలను స్వయంగా ధృవీకరించవచ్చు. బంగారం కొనుగోలు చేసిన వెంటనే బిల్లు, వారంటీ, హాల్‌మార్క్‌ వివరాలను భద్రంగా ఉంచుకోవాలి. బంగారం కొనుగోలు చేసే సమయంలో ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మోసాలను నివారించడమే కాకుండా, భవిష్యత్తులో మంచి రీసేల్‌ విలువ కూడా పొందవచ్చు. హాల్‌మార్క్‌, సరైన బిల్లు, మేకింగ్‌ ఛార్జీలు, రాళ్ల విలువ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించి కొనుగోలు చేయాలి.

Follow Us