Loan Scam: లోన్ పేరుతో కొంపముంచిన కేటుగాళ్లు.. పోస్ట్ మాస్టర్‌కు రూ.87 వేలు టోకరా..!
పెరిగిన టెక్నాలజీను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసగించే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా మన అవసరాలనే అవకాశంగా మలుచుకుని మన సొమ్మునే కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం లోన్ కోసం అప్లయ్ చేద్దామనుకున్న యువకుడిని ట్రాప్ చేసిన ఓ గ్యాంగ్ లోన్ ఇవ్వకపోగా అతని బ్యాంక్ ఖాతా నుంచే రూ.87 వేలు కొట్టేసింది.
టెక్నాలజీ సంబంధిత మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ తీసుకోవాలని ఎంత అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. రుణం కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఓ వ్యక్తికి కేటుగాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు. లూథియానాకు చెందిన ఒక పోస్ట్‌మాస్టర్ రుణానికి సంబంధించిన సైబర్ మోసానికి బలై రూ. 87,000 కోల్పోయాడు. సుధార్ ప్రాంతంలోని కైల్లే గ్రామానికి చెందిన బాధితుడు సరబ్‌జిత్ సింగ్ ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు సమర్పించిన కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 4న, తన లోన్ ఆమోదించినట్లు యాప్ ప్రతినిధిగా పేర్కొంటూ ఒక వ్యక్తి నుంచి అతనికి కాల్ వచ్చింది.
దరఖాస్తుదారుడు కేవైసీ (నో యువర్ కస్టమర్) వెరిఫికేషన్ అసంపూర్తిగా ఉన్నందున లోన్‌ను అందించడం సాధ్యం కాదని ఆ ప్రతినిధి పోస్ట్ మాస్టర్‌కు తెలిపాడు. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి తాము పంపిణ లింక్ ద్వారా వివరాలను అందించాలని వివరించాడు. ఈ మేరకు ఆన్‌లైన్ కేవైసీ ఫారమ్ పేరుతో ఓ లింక్‌ను అతని మొబైల్‌కు వచ్చింది. లోన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కేవైసీ తప్పనిసరి అని భావించిన పోస్ట్ మాస్టర్ ఆ లింక్‌లో అడిగిన వివరాలను అందించారు. అలాగే ఖాతా ధ్రువీకరణను ఖరారు చేయడానికి రూ.5 టోకెన్ చెల్లింపు చేయాలని కోరడంతో ఓటీపీ ఎంటర్ చేశాడు. అయితే అతని బ్యాంకు ఖాతాలో రూ.5కి బదులు రూ.86,998 కట్ట్ అయ్యింది. దీంతో బాధితుడు మోసగాడికి ఫోన్ చేయగా ఆ వ్యక్తి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
తాను మోసపోయానని గ్రహించిన సరబ్‌జిత్ తర్వాత జాగ్రావ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తదుపరి విచారణ కోసం కేసును సైబర్ క్రైమ్ విభాగానికి పోలీసులు ఫిర్యాదును బదిలీ చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 318(4), అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సెక్షన్ 66(డీ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చోరీకి గురైన నగదును ఏ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారో గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా నిరోధించడానికి తెలియని కాలర్లు లేదా అనుమానాస్పద లింక్‌లతో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు లోన్ అందించేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ వారిని నియమించుకోరనే విషయాన్ని గమనించాలని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి