Post Office Investment: ఆ పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడితో రాబడి వరద.. టాప్-4 స్కీమ్స్ ఇవే..!
భారతదేశంలోని గ్రామీణ ప్రజలు పొదుపు మార్గంలో పయనించేలా చేయడంలో పోస్టాఫీసు పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి గ్రామంలో పోస్టాఫీసు ఉండడంతో సొమ్మును పొదుపు చేయడం సులువుగా ఉంటుంది. అలాగే ఊళ్లోనే పోస్టాఫీసు ఉండడంతో మహిళలు కూడా సొమ్ము పొదుపు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీసు పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ప్రజలు సాధారణంగా కొత్త సంవత్సరంలో ఆకాంక్షలు, ప్రతిష్టాత్మక లక్ష్యాల కోసం పొదుపు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ మంది ప్రజలు తమ కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే హామీతో కూడిన స్థిర రాబడిని అందించే అనేక ప్రభుత్వ ఆధారిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పోస్టాఫీసు పథకాలు మెరుగైన రాబడిని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
కిసాన్ వికాస్ పత్ర
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకం ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కనీస పెట్టుబడి రూ. 1,000తో కేవీపీ ఖాతాను ప్రారంభించవచ్చు. అలాగే మనం పెట్టే పెట్టుబడిపై ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. కేవీపీ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన మూలధనం 115 నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది. అంటే దాదాు 9 సంవత్సరాల 7 నెలలకు మన పెట్టుబడి డబుల్ అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్
కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో ఉంటున్న ఇండియన్ పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే టైమ్ డిపాజిట్ (టీడీ) పథకాన్ని అందిస్తుంది. ఈ పథకం 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్లను అనుమతిస్తుంది. వడ్డీ రేట్లు 6.9 శాతం నుంచి 7.5 శాతం మధ్య మారుతూ ఉంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది పోస్టాఫీసులో ఉండే మరో పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పదవీ కాలాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఒకేసారి 5 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకంలో ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అలాగే కుమార్తెకు 18 ఏళ్లు వచ్చి వివాహం జరిగితే ఆ సమయంలో ఖాతా మూసివేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి