Aadhar update: ఆధార్ ఉచిత అప్‌డేట్‌కు గడువు పెంపు.. కీలక విషయం ఏంటంటే?
దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యంత అవసరమైన పత్రాలతో ఆధార్ కార్డు ముందుంటుంది. దేశ పౌరుడిగా గుర్తింపునివ్వడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ సేవలను పొందేందుకు ఉపయోగపడుతుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దీన్ని జారీ చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు అందజేస్తుంది. దానిలో పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాలు ఉంటాయి. అయితే ఆధార్ కార్డులో వివరాలన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఏమైన తప్పులు దొర్లితే వెంటనే సరిదిద్దుకోవాలి. ప్రస్తుతం ఆధార్ కార్డులో చిరునామాను ఉచితంగా మార్చుకునే అవకాశం ఉంది.

Aadhaar
ఆధార్ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని 2025 జూన్ 14 వరకూ యూఐడీఏఐ పొడిగించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కార్డులోని చిరునామాను సవరించుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం రీత్యా చాలామంది తమ సొంతూరి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళతారు. వీరందరూ కొత్త చిరునామాను ఆధార్ కార్డులో అప్ డేట్ చేసుకోవాలి.
ఆన్ లైన్ విధానంలో..
- ఆధార్ కార్డు చిరునామాను ఆన్ లైన్ లో చాాలా సులభంగా మార్చుకోవచ్చు. ముందుగా ssup.uidai.gov.in వెబ్ సైట్ కు వెళ్లాలి.
- ఆధార్ నంబర్ నమోదు చేసి తర్వాత, రిజిస్టర్ మొబైల్ వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి.
- ఆధార్ లో చిరునామాను నవీకరించు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- దానిలో వివరాలు నమోదుచేసి, కొత్త చిరునామా అప్ డేట్ కు అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసుకోవాలి. వీటిలో పాస్ పోర్టు, బ్యాంకు స్టేట్ మెంట్, ఓటర్ ఐడీ, యుటిలిటీ బిల్లులు ఉంటాయి.
- అనంతరం మీకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (ఎస్ఆర్ఎన్) వస్తుంది. దాని ఉపయోగించి మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
- నిర్ణీత సమయంలో మీ ఆధార్ కార్డులో చిరుమానా అప్ డేట్ అవుతుంది.
ఆఫ్ లైన్ విధానం
- ఇంటర్నెట్ లేనివారు, కంప్యూటర్ పై అవగాహన లేనివారు ఆఫ్ లైన్ విధానంలోనూ చిరుమానాను మార్చుకోవచ్చు.
- మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ అప్ డేట్ ఫారం తీసుకుని, వివరాలు నమోదు చేయండి.
- కొత్త చిరునామాను ధ్రువీకరించే రుజువులు అందజేయండి. బయోమెట్రిక్ తో మీ గుర్తింపును ప్రామాణీకరించండి.
- అక్కడి సిబ్బంది మీ చిరునామా మార్పుకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. దీని కోసం నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు.
- మీ సర్వీస్ నంబర్ ను, రశీదును జాగ్రత్త చేసుకోండి. సుమారు రెండు వారాల్లో మీ ఆధార్ కార్డులో కొత్త చిరునామా అప్ డేట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




