Auto Expo: సూపర్ పవర్డ్ ఎస్‌యూవీ లాంచ్ చేసిన ఎంజీ.. ఇక టయోటా ఫార్చ్యునర్‌కు గట్టిపోటీ ఫిక్స్
భారతదేశంలో ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో చాలా కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తమ సేల్స్ పెంచుకునే విధంగా రూపొందించిన కార్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఎంజీ మోటార్స్ మేజిస్టర్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీను లాంచ్ చేసింది. ఈ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త ఎస్‌యూవీ మేజిస్టర్‌ను ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ చూడడానికి గ్లోస్టర్‌కు సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా కనిపిస్తుంది. కంపెనీ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ కంపెనీ గ్లోస్టర్ శ్రేణిలో టాప్ వేరియంట్‌గా ఉంటుంది. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఏడీఏఎస్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు ఆటో హోల్డ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ మేజిస్టర్ ప్రత్యేకతగా ఉంటున్నాయి. ఎంజీ మేజిస్టర్ ఎస్‌యూవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
ఎంజీ మేజిస్టర్ ఎస్‌యూవీలో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. అందువల్ల ఈ కారు 213 బీహెచ్‌పీ పవర్, 478 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్‌లతో అందిస్తున్న ఈ కారులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ ఫీచర్ ఈ కారులోని అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే మీకు 4×4 సిస్టమ్‌ని ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. అంటే ఈ ఫీచర్ ఎంపిక చేసిన వేరియంట్‌లలో మాత్రమే కనిపిస్తుంది. ఎంజీ మేజిస్టర్ ధర రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి టాప్ వేరియంట్ రూ. 45 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.
అలాగే ఎంజీ గ్లోస్టర్ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీ ధర రూ. 39.57 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 44.03 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎంజీ మేజిస్టర్ ఇదే ధరల్లో రిలీజ్ చేస్తే ఈ విభాగంలో ఇదే ధరలో అందుబాటులో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌కు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ధర రూ. 44.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 48.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








