Credit card: యూపీఐ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. క్రెడిట్ కార్డును లింక్ చేసుకునే అవకాశం
ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్ల శకం నడుస్తోంది. పట్టణాలు, గ్రామాలతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన తోపుడు బండ్ల నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ చెల్లింపులు జరుపుతున్నారు. ఈ చెల్లింపు అవకాశం లేని దుకాణం దేశంలో లేదంటే అతిశయోక్తి కాదు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని ఉపయోగించి స్మార్ట్ ఫోన్ల ద్వారా చాలా సులభంగా వేగంగా లావాదేవీలు జరపవచ్చు.
2024 డిసెంబర్ లో యూపీఐ లావాదేవీలు 16.73 బిలియన్లకు చేరి, ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానం చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకూ బ్యాంకులు మంజూరు చేసిన డెబిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసుకునే విధానం ఉండేది. మన బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంటే యూపీఐ లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు క్రెడిట్ కార్డును కూడా యూపీఐ ఖాతాకు అనుసంధానం చేసుకునే అవకాశం కలిగింది. దీని ద్వారా ఆర్థిక లావాదేవీలను మరింత సులువుగా నిర్వహించుకునే వీలుంటుంది. క్రెడిట్ కార్డును కూడా తీసుకువెళ్లకుండానే దాని సేవలను వినియోగించుకోవచ్చు. ఈ కింద తెలిపిన పద్దతులు పాటించి యూపీఐకి క్రెడిట్ కార్డును లింక్ చేసుకోవాలి.
అనుసంధానం చేసే విధానం
- ముందుగా యూపీఐ లావాదేవీల కోసం భీమ్, ఫోన్ పే వంటి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత చెల్లింపు పద్దతి జోడించు అనే విభాగానికి వెళ్లాలి.
- యూపీఐకి అనుసంధానం చేయడానికి క్రెడిట్ కార్డు అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- మీ కార్డు నంబర్, సీవీవీ, గడువు తేదీ తదితర వాటిని నమోదు చేయాలి. ధ్రువీకరణ కోసం మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.
- దాన్ని ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ ఐడీకి వస్తుంది. దాని ద్వారా డబ్బులను పంపడానికి, స్వీకరించడానికి మీకు అనుమతి లభిస్తుంది.
- బిల్లుల చెల్లింపు, నిధుల బదిలీ తదితర వాటి కోసం ఈ ఐడీని ఉపయోగించుకోవచ్చు.
చెల్లింపులు ఇలా..
- మీ క్రెడిట్ కార్డుకు యూపీఐ ఖాతాను లింక్ చేసిన తర్వాత చెల్లింపులు జరపడం చాలా సులభం. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా, ఫోన్ నంబర్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.
- చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, క్రెడిట్ కార్డు చెల్లింపు పద్దతిని ఎంపిక చేసుకోవాలి. పిన్ నమోదు చేసి, లావాదేవీలు పూర్తి చేసుకోవాలి.
- పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, కెనరా బ్యాంకు, కోటక్ మహీంద్రా, యస్ బ్యాంకు తదితర 22 బ్యాంకులు ఈ ఫీచర్ ను అందజేస్తున్నాయి. ప్రస్తుతం రూపే కార్డులను మాత్రమే యూపీఐకి లింక్ చేసుకోవచ్చు.
ప్రయోజనాలు
- క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగించడం వల్ల తక్షణ బదిలీలు, కాంటాక్టు లెస్ చెల్లింపులను సులభంగా చేయవచ్చు.
- ఈ పద్దతిని ఉపయోగించుకోవడానికి అదనపు రుసుము చెల్లించనవసరం లేదు. క్రెడిట్ కార్డు వివరాలను మాన్యువల్ గా నమోదు చేయవచ్చు.
- క్రెడిట్ కార్డును అవసరమైన మేర మాత్రమే వాడడం, పరిమితి దాటకుండా చూసుకోవడం చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి