EPFO: సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ ఒక్క యూపీఐ యాప్ మీ మొబైల్‌లో ఉండాల్సిందే..
EPFO Withdrawal: త్వరలో యూపీఐ యాప్ సాయంతో పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది. మరో మూడు నెలల్లోనే ఈ సౌకర్యం ఈపీఎఫ్‌వో కల్పించనుంది. అలాగే ఏటీఎం ద్వారా కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు తగిన ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి.

BHIM UPI: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO). పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లోని డబ్బులను సులువుగా విత్ డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో ఏటీఎం, యూపీఐ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏటీఎం కార్డు, యూపీఐ యాప్‌ల సహాయంతో నగదును తీసుకునే సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన భీమ్(BHIM) యాప్‌ను ఉపయోగించుకోనుంది. భీమ్ యాప్ ద్వారా పీఎఫ్ డబ్బులు సెకన్లలోనే విత్ డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేయనుంది. ఇందుకోసం నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో ఈపీఎఫ్‌వో భాగస్వామ్యం కానుంది.
భీమ్ యాప్ సాయంతో..
ఎన్‌పీసీఐ అనేది కేంద్ర ప్రభుత్వం సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే భీమ్ యాప్ కొనసాగుతోంది. ఈ భీమ్ యాప్‌ను ఈపీఎఫ్ ఖాతాలతో లింక్ చేసే ప్రక్రియ చేపడుతున్నారు. దీని వల్ల ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను భీమ్ యాప్ ద్వారా సులువుగా ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతం కేవలం భీమ్ యాప్‌లోనే ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానుండగా.. రాబోయే రోజుల్లో అన్నీ యూపీఐ ఫ్లాట్‌ఫామ్‌లలో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో భీమ్ యాప్ ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. భీమ్ యాప్‌లో డబ్బులు తీసుకోవడానికి క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టగానే ఈపీఎఫ్‌లో బ్యాకెండ్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ద్వారా డబ్బులు జమ అవుతాయి. అయితే యాప్ ద్వారా విత్ డ్రాలకు సంబంధించి పలు పరిమితులు కూడా విధించనున్నారని తెలుస్తోంది.
ఆర్బీఐ నిబంధనలు
యూపీఐ యాప్స్ విత్ డ్రాలపై ఆర్బీఐ కొన్ని పరిమితులు విధించింది. దీంతో పీఎఫ్ అకౌంట్లోని డబ్బులను ఒకసారి ఉపంసహరించుకోలేరు. యూపీఐ యాప్స్ నగదు పరిమితులను పాటించాల్సి ఉంటుంది. అయితే యూపీఐ ద్వారా ఎంత పరిమితిలో డబ్బులు ఉపసంహరించుకోవచ్చనేది ఇంకా నిబంధనలు రూపొందించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన లిమిట్స్‌ను ప్రకటించే అవకాశముంది. పీఎఫ్ అకౌంట్లోని నగదును మొత్తం ఒకేసారి ఉపసంహరించుకోవడానికి కుదరదు. 25 శాతం మినిమం అమౌంట్‌ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మిగతా సొమ్మును ఇతర కారణాలతో ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఈపీఎఫ్‌లో తీసుకురానుందని తెలుస్తోంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా ఏటీఎంల సహాయంతో ఉపసంహరించుకునే సదుపాయం కూడా అప్పటినుంచో అమల్లోకి తీసుకురానుందని సమాచారం.
