OLA Electric: ఓలా ఎలక్ట్రిక్స్‌కు షాక్ ఇచ్చిన వినియోగదారులు.. దెబ్బకు 4వ స్థానానికి డౌన్..
OLA Electric: ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు షాక్ ఇచ్చారు వినియోగదారులు. వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటంతో..
OLA Electric: ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు షాక్ ఇచ్చారు వినియోగదారులు. వరుసగా అగ్ని ప్రమాదాల బారిన పడుతుంటంతో ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. దాంతో జూన్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రిజిస్ట్రేషన్స్ దారుణంగా పడిపోయాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్‌లో ఓలా నాలుగో స్థానానికి పడిపోయింది.
అధికారిక డేటా ప్రకారం.. జూన్ నెలలో 5,869 ఎలక్ట్రిక్ స్కూటర్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే, ఒకినావా ఆటోటెక్ 6,976 వాహనాల రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆంపియర్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్కూటర్స్ 6,534తో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత 6,486 ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్స్ హీరో కంపెనీ మూడవ స్థానంలో నిలిచింది. ఇక ఏథర్ ఎనర్జీకి సంబంధించి మే నుండి జూన్ వరకు 3,797 వాహనాల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. రివోల్ట్ కంపెనీకి చెందిన 2,419 వాహనాలకు రిజిస్ట్రేషన్లు జూన్‌లో జరిగాయి.
ఓలా రిజిస్ట్రేషన్స్ మే 30తో పోలిస్తే జూన్ 30 వరకు 30 శాతానికి పైగా తగ్గాయి. ఒకినావా మేలో 9,302 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అదే సమయంలో ఓలా ఎలక్ట్రిక్ 9,225 యూనిట్ల S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను డెలివరీ చేసింది. ఈ నష్టంపై స్పందించిన ఓలా.. ‘సేవలను మరింత మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తున్నాం. జులైలో విక్రయాలు పెరిగేందుకు కృషి చేస్తాం. కస్టమర్లకు విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకుంటాం’’ అని కంపెనీ పేర్కొంది.
అయితే, పెరుగుతున్న అగ్నిప్రమాదాలు, బ్యాటరీ పేలుళ్లపై విచారణ జరిపిన భారత ప్రభుత్వం.. బ్యాటరీలలో లోపాల కారణంగానే ఈ పేలుళ్లు జరుగుతున్నాయని నిర్ధారించింది. కాగా, ఈ పేలుళ్ల కారణంగా EV 2-W రిజిస్ట్రేషన్‌ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని పరిశ్రమ నిపుణులు విశ్లేషించారు.