Edible Oil Prices: సామాన్యులకు శుభవార్త.. వంట నూనెల ధరలను రూ.10 నుంచి రూ.20 తగ్గిస్తూ కంపెనీల నిర్ణయం..
వంట నూనెల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చాయి. వంట నూనె కంపెనీలు. రిఫైన్డ్ పొద్దు తిరుగుడు, సోయాబీన్ నూనెల ధరలను లీటరుకు రూ.10-20 మేర తగ్గిస్తూ కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి...
వంట నూనెల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చాయి. వంట నూనె కంపెనీలు. రిఫైన్డ్ పొద్దు తిరుగుడు, సోయాబీన్ నూనెల ధరలను లీటరుకు రూ.10-20 మేర తగ్గిస్తూ కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. గత వారం అంతర్జాతీయంగా ముడి పామోలిన్, సోయా నూనెల ధరలు 6-11 శాతం తగ్గడంతో, అందుకనుగుణంగా ఇక్కడా ధరలు తగ్గించేందుకు అవకాశం ఏర్పడిందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా చెప్పారు. సన్ ఫ్లవర్ నూనె ఉక్రెయిన్ నుంచి సరఫరా అవుతుంటుంది. యుద్ధం వల్ల అక్కడ నుంచి సరఫరాలు ఆగడంతో రష్యా, అర్జెంటీనా లాంటి దేశాలు సన్ ఫ్లవర్ నూనె సరఫరా ప్రారంభించడం భారత్‌కు ఉపకరించింది. ప్రస్తుతం శుద్ధి చేసిన సోయాబీన్ నూనె లీటరు గరిష్ఠ విక్రయ ధర రూ.200- 220 ఉండగా, సన్ ఫ్లవర్ నూనె లీటరు ప్యాకెట్లపై రూ.240- 250 ఉన్నాయి.
అయితే ఈ ధరల కంటే తక్కువగానే విపణిలో నూనెలు లభిస్తు్న్నాయి. ఇప్పుడు తగ్గించిన మేర గరిష్ఠ చిల్లర ధరలో మార్పులు చేసిన తర్వాత ప్యాకెట్లు వినియోగదారులకు చేరేందుకు 10-15 రోజులు పట్టొచ్చని మెహతా తెలిపారు. దుకాణదారులు అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన నిల్వలు పూర్తయ్యే వరకు, తగ్గించిన ధరకు విక్రయించేందుకు నిరాకరిస్తారని పేర్కొన్నారు. అదానీ విల్మర్, రుచి సోయా, హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ గురువారం ధరలు తగ్గించాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎంఆర్‌పీ గత 2 వారాల్లో లీటరుకు రూ.35 మేర తగ్గిందని తెలుస్తుంది. రిటైల్ విపణిలో రైస్‌బ్రాన్ ఆయిల్ లీటరు రూ.175, సన్‌ఫ్లవర్ నూనె రూ.180-190 మేర విక్రయమవుతున్నట్లు సమాచారం.